అధికార ప్రతిపక్షాల మన్ననలను పొందిన మేయర్ డాక్టర్ శిరీష
అధికార, ప్రతిపక్షాల మన్ననలు పొందిన మేయర్ డాక్టర్ శిరీష...
తిరుపతి నగర రూపురేఖల మార్పుకు శ్రీకారం చుట్టాం.
చారిత్రక తిరుపతి నగరానికి తొలి మేయర్ కావడం నాకు లభించిన అరుదైన గౌరవం.
తిరుపతి మార్చి 13 మాయావి న్యూస్ :
ఎంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో అయినా.. తీవ్రమైన వాగ్వివాదాలు జరుగుతున్న సమయంలోనైనా... రాజకీయ పార్టీలు ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుని... కార్పొరేటర్లు కొట్టుకునే పరిస్థితి ఎదురైన... మేయర్ స్థానంలో కూర్చున్న మొదటి మహిళ డాక్టర్ శిరీష తన మోములో చిరునవ్వును వీడలేదు... ఎంతటి క్లిష్ట పరిస్థితి నైనా అలవోకగా ఎదుర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంలో మేయర్ స్థానంలో కూర్చున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆమె వైపు ఎవరు విమర్శనాత్మకమైన వేలెత్తి చూపించకుండా నేటి వరకు మేయర్ స్థానంలోనే నెగ్గుకు రాగలిగారు అంటే ఒక డాక్టర్ శిరీష కే వివాదారహిత నాయకురాలిగా సాధ్యమైంది.
తిరుపతి నగరపాలక సంస్థ చివరి కౌన్సెల్ సమావేశం ప్రారంభ ఉపన్యాసంలో మేయర్ డాక్టర్ శిరీష భావోద్వేగంగా ప్రసంగించారు.
తిరుపతి నగర రూపురేఖలను మార్చేందుకు బలమైన పునాదులతో శ్రీకారం చుట్టాం.. మా ఐదు సంవత్సరాల పాలనలో తీసుకున్న నిర్ణయాలే తిరుపతి గ్రేటర్ నగరంగా మారడానికి అడుగులు పడుతున్నాయని.. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు..
నగరపాలక సంస్థ ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మేయర్ చివరి ప్రసంగం చేశారు..
మేయర్ డాక్టర్ శిరీష తన ప్రారంభ ప్రసంగంలో.....
ఆధ్యాత్మిక కేంద్రం శ్రీవారి పాదాల చెంత నెలకొన్న తిరుపతి నగరానికి ప్రజాప్రతినిధులుగా పనిచేయడం మనందరి అదృష్టం.. దాదాపు ఐదు లక్షల మంది తిరుపతి నగర ప్రజలలో మనకు మాత్రమే లభించిన అరుదైన గౌరవం.
ఐదు సంవత్సరాల మన పాలనలో అనేక తీపి గుర్తులు, మరిచిపోలేని అనుభూతులు మన కళ్ళ ముందు మేదలాడుతున్నాయి. ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో వాటిని అందరూ నెమరువేసుకుందాం. ఈ సమావేశాలు సాధారణ సమావేశాలకు భిన్నమైనవి. నేను ఒక్క విషయాన్ని ఆత్మవిశ్వాసంతో చెప్పగలను ఎన్ని పరిమితులు ఉన్నా మనల్ని ఎన్నుకున్న ప్రజల ముందు మేము మీ కార్పొరేటర్లు అని చెప్పగలిగే స్తాయిలో మన పనితీరు ఉన్నదని. ఈ కౌన్సిల్ లో రాజకీయాలకు కొత్త అయిన నా లాంటి వాళ్ళు, విశేష అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు.. చిన్నా పెద్దా అన్న బేధ భావం లేకుండా అందరూ కలిసి పనిచేశాము. మనం తీర్మానం చేసినట్లు గ్రేటర్ తిరుపతి గా మారితే మనకు చరిత్రలో ఎవరికి దక్కని మరో గౌరవం కూడా దక్కుతుంది. తిరుపతి నగర పాలక సంస్థకు మొదటి చివరి కార్పొరేటర్లు, మరియు మొదటి చివరి మేయర్ గా నేను నిలిచిపోతాం.. ఎందుకంటే మున్సిపాలిటీకి ఎందరో చైర్మన్లు గా పనిచేశారు.. కానీ నగర పాలక సంస్థ ఏర్పడిన తర్వాత మనదే మొదటి కౌన్సిల్.. గ్రేటర్ గా మారితే గ్రేటర్ నగరం అవుతుంది.. అప్పుడు మన కౌన్సిల్ మొదటిది , చివరిది అవుతుంది..
మనం ఏమి చేశాము అంటే తిరుపతి నగర రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాము. మన నగర పరిధిలో ఇప్పటివరకు పనిచేసిన కౌన్సిల్ లు అంతర్గత అభివృద్ధి, ప్రజల రోజువారి అవసరాలపై దృష్టి పెడితే మనం తిరుపతి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాము. తిరుపతి నగరంలో చిన్న రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన కూడా సాధ్యం కాని రోజులు నుంచి కీలకమైన కూడళ్లలో విస్తరణ పూర్తి చేయడం ద్వారా నగర పౌరుల ప్రయాణాన్ని సులభతరం చేసాము. కోర్లగుంట సర్కిల్, గంగమ్మ గుడి సర్కిల్,బాలాజీ కాలనీ కూడలి, ఏం.ఆర్.పల్లి కూడలి వద్ద నిలుచుని ఇది మేము చేశామని గర్వంగా చెప్పుకునే విధంగా మనం అభివృద్ధి చేశాము. తిరుపతి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రోడ్డుల నిర్మాణం ఒక సాహసం.. నేడు ఆ రోడ్లు తిరుపతి భవిష్యత్తుకు సూచికగా నిలబడుతున్నాయి . ఇంత అభివృద్ధి చేయగలిగాము అంటే నాటి శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి సహకారం.. మన సహచర ఉప మేయర్ గా పనిచేసిన అభినయ్ రెడ్డి ప్రతిపాదనలు కీలకం అని చెప్పడం బాధ్యతగా భావిస్తున్నాను.
వ్యక్తిగతంగా నేను అనేక సంవత్సరాల పాటు ఒక సాధారణ భక్తురాలిగా తిరుపతిలో గంగమ్మ ఆలయానికి వెళ్ళేదాన్ని దర్శనానికి, మొక్కులు తీర్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డానో ఒక భక్తురాలుగా నాకు తెలుసు. నేడు ఆలయ ప్రాంత డివిజన్ కార్పొరేటర్ గా నగర మేయర్ గా నాకు సంతృప్తి నిచ్చింది ఏమిటి అంటే నేడు ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ఆలయ పరిసర ప్రాంతాలు సౌకర్యంగా మారాయి. గంగమ్మ ఆలయ అభివృద్ధి మన హయాంలో కొత్త రూపు వచ్చింది.. కబడ్డీ పోటీలు, కచ్చీఫీ ఆడిటోరియం ఇలా మనం అభివృద్ధి పనులు చేయడం మనందరం సంతోషించే అంశం.
క్లిష్ట సమయంలో కార్పొరేటర్లు ఆదర్శంగా నిలిచారు.. కరోనా సమయంలో కుటుంబ సభ్యులు కూడా దహన క్రియలకు దూరంగా ఉండే భయానక పరిస్తితులలో మన కార్పొరేటర్లు చేసిన సాహసం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సేవా కార్యక్రమాల నిర్వహణలో మన కార్పొరేటర్లు గొప్ప పాత్ర పోషించారు. వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు అండగా నిలబడిన తీరు ప్రశంసనీయం.
ప్రతి ఒక్కరు మనసు ఇప్పి మాట్లాడుకుందాం... ఈ కౌన్సిల్ మనల్ని మనం ఆవిష్కరించుకునే సమావేశం మనకు అవకాశం ఇచ్చిన వారి గురించి, మనం చేసిన మంచిని గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం అని నమ్ముతున్నాను.నేను డాక్టర్ గా ప్రజా జీవితంలో చాలా కాలం నుంచి ఉన్నాను.. కానీ రాజకీయంగా ప్రజా జీవితంలో పొందిన సంతృప్తి చాలా గొప్పది.. అందుకే రాజకీయాలు అంటే నాకు గౌరవం వచ్చింది.. అన్ని రంగాల్లో కన్నా రాజకీయ రంగంలోనే సమాజానికి గొప్పగా సేవ చేయవచ్చు అని ఈ స్వల్ప రాజకీయ అనుభవం నాకు నేర్పింది. ఇక్కడ ఉన్న వారు అందరూ గొప్ప వారే ఎవరికి.. ఎవరూ తీసిపోరు.. మేయర్ కావడం నాకు లభించిన అరుదైన గౌరవం.. నన్ను మేయర్ గా ఈ స్తానంలో కూర్చోబెట్టిన తిరుపతి నగర ప్రజలకు , కార్పొరేటర్ల కు ప్రత్యేక కృతజ్ఞతలు.. మీ అందరి సహకారం, ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోను.. రాజకీయాలకు నేను కొత్త అయినా మీరు నన్ను గౌరవించారు, సహకరించారు. అందుకే ఐదు సంవత్సరాల నా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాను.. నేను మీకు ఏమి ఇవ్వకపోవచ్చు కానీ మేము మేయర్ గా ఎన్నుకున్న శిరీష పద్ధతిగా ఉన్నది అని మీరు చెప్పుకునే విధంగా ఉన్నాను అని చెప్పగలను.
మేయర్ గా అరుదైన గౌరవం ఇచ్చిన వారి గురించి, అను నిత్యం నన్ను ప్రోత్సహిస్తూ నాకు స్పూర్తి నిచ్చిన వారి గురించి నెమరు వేసుకోవడం నా బాధ్యత . ఇది సరైన సమయం కూడా.. నేను రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాదు, ఒక సాధారణ డాక్టర్ ని. గురువారెడ్డి గారు లాంటి గొప్పవారు చైర్మన్ గా పనిచేసిన స్థానం ఇది. మహామహులు ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గం. అన్నింటి కన్నా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి పాదాల చెంత నెలకొన్న నగరం ఈ నగరానికి ప్రథమ పౌరురాలు కావడం అసాధారణ విషయం అలాంటి అసాధారణ గౌరవాన్ని నాకు ఇచ్చిన తిరుపతి మాజీ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కి, మా పార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త అభినయ్ రెడ్డి కి కృతజ్ఞతలు. పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నా నా పట్ల నమ్మకం ఉంచి నన్ను మేయర్ గా చేసిన భూమన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. జనరల్ స్తానంలో బీసీ మహిళ గా నాకు ఈ స్థానం లభించింది అంటే జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న రాజకీయ నిర్ణయ పలితం. తిరుపతికి పునాది గోవిందరాజులు గుడి.. గోవింద రాజు పురం తో ప్రారంభించి నేడు తిరుపతి మహానగరంగా మారింది.. ఈ నగరానికి పునాది వేసిన వారు యాదవ వంశానికి చెందిన గట్టురాజులు అలాంటి సామాజిక తరగతికి చెందిన వారికి రాజకీయ నాయకత్వంలో సముచిత స్థానాన్ని ఇవ్వాలన్న తలంపుతో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం.. నా పట్ల అత్యంత నమ్మకంతో తిరుపతి మేయర్ గా నన్ను ఎంపిక చేశారు సాధారణ కుటుంబంకు చెందిన నాకు అసాధారణ గౌరవం , హోదా ఇచ్చిన మన ప్రియతమ నేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. ఒక మహిళ అందులో ఎలాంటి రాజకీయ అనుభవం లేని నన్ను నిత్యం ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచిన నా భర్త డా మునిషేకర్, మా నాన్న, అమ్మ నా ఇద్దరు పిల్లలు ఇచ్చిన సహకారం తోనేను సాఫీగా నా విధులను నిర్వహించగలిగాను. మహిళలను ప్రోత్సహించాలి అని ఉపన్యాసాలు అందరూ చెపుతారు వారి వరకు వచ్చినప్పుడు అందుకు భిన్నంగా ఉంటారు.. కానీ నా అదృష్టం నా కుటుంబం అన్ని విధాల నన్ను ప్రోత్సహించింది.
ఐదు సంవత్సరాల కాలంలో నాకు లభించిన గొప్ప అవకాశం మంచి అధికారులతో పనిచేయడం, రాజకీయ పాలనా అనుభవం లేని నాకు ఎంతో అనుభవం వచ్చింది. గిరీష లో పరిపాలన జాగ్రత్తలు అనుపమ అంజలి తో ముఖుసూటి తనం, అదితి సింగ్ లో నిజాయతీ, పని పట్ల నిబద్దత నేర్చుకున్నాను. ప్రస్తుత కమిషనర్ మౌర్య లో నిర్మొహమాటం , ఎలాంటి క్లిష్టమైన పని అయినా వత్తిడి లేకుండా చేయడం నేర్చుకున్నాను. స్థూలంగా కమిషనర్ లు అందరూ నన్ను అత్యంత అభిమానంతో చూసారు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. హరిత తో సహా ఇతర ఉన్నతాది కారులు, వందల మంది సిబ్బంది.. ప్రత్యేకించి నా వ్యక్తిగా సిబ్బంది నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు.. నాకు బాగా సంతృప్తి ఇచ్చింది.. అందరూ నన్ను మేయర్ గా కన్నా మా ఇంటి మనిషి అన్నట్లు ప్రేమగా చూసుకోవడం నాకు లభించిన గొప్ప వెసులుబాటుగా భావిస్తాను. కీలక పదవిలో ఉంటే మీడియాలో ఏదో సందర్భంగా విమర్శలు వస్తుంటాయి.. కానీ నాకు తెలిసి ఒక్క మీడియా కూడా ఒక్క విమర్శ కూడా నాపై చేయలేదు.. అది నా గొప్ప అనడం కన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ప్రోత్సహించాలి అన్న అభిమానం అని నమ్ముతున్నాను.
బాధ్యతల నుంచి తప్పుకునే ఈ సమయం కాస్త ఇబ్బందిగానే ఉన్నది. పదవి మీద మోజుతో కాదు ఏదో తెలియని వెలితి.. నగర పాలక సంస్థ కార్యాలయం, సిబ్బంది, అధికారులతో నగర అభివృద్ధి గురించి చర్చలు.. కార్పొరేటర్ల తో కలిసి ప్రయాణించిన తిపిగుర్తులు, చిన్న పని ప్రజలకు చేస్తే వారు చూపే ప్రేమ కోల్పోతామెమో అనిపిస్తుంది.. ఎందుకంటే ఇంతకు ముందు ప్రస్తావించినట్లు నన్ను అందరూ మేయర్ గా కన్నా సొంత మనిషిగా ఆదరించారు.. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి కాని అభిమానాలను అలా చూడలేము.. సంతోషం, అభిమానం , గుర్తింపు, భావోద్వేగం అన్ని ఉన్న ఈ సమయంలో నేను ఒక మాట చివరిగా చెపుతాను... నేను ఏమి సాధించాను అంటే నన్ను ఈ స్తానంలో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరి ముందు నేను నిలబడి నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు అని గర్వంగా చెప్పగలను. నగర పాలక సంస్థ మేయర్ స్తానాన్ని వివాదాలకు దూరంగా ఉంచాను. నన్ను ఈ స్థానానికి ఎంపిక చేసినప్పుడు, తర్వాత అనేక ప్రచారాలు జరిగాయి.. 2024 ఎన్నికల తర్వాత రాష్ట అదికార మార్పు జరిగింది.. మళ్ళీ రకరకాల ప్రచారాలు ఈ మొత్తం వ్యవహారంలో నేను భగవంతుడిని నమ్ముకున్నాను, నా పట్ల నాకున్న విశ్వాసం , అనునిత్యం నా శ్రేయస్సు కోరే వారి వెలట్టలేని మద్దతుతో అన్నింటికి కాలమే సమాధానం చెపుతుందని నిబ్బరంగా నిలబడ్డాను. పలితంగా ధైర్యంగా , గర్వంగా ఆత్మవిశ్వాసంతో మీ ముందు నిలబడ్డాను. నన్ను మేయర్ గా ఎంపిక చేసిన వారు సంతోషించే మంచి పేరు తీసుకువచ్చానన్న సంతృప్తితో పదవిని పూర్తి చేసుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వినమ్రంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.
కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం , నగర కమిషనర్ మౌర్య , కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.