జిఎం శేషారెడ్డి పదవీకాలం పొడిగింపు తిరస్కరించిన టిటిడి బోర్డు.. అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించడంలో టీటీడీ ఈవో మౌనం.. మాయావి కథనంపై టిటిడి ఉద్యోగులలో హర్షాతిరేకాలు.
టిటిడి ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి
రెండేళ్ల పదవీకాలం పొడిగింపు తిరస్కరణ
👉అవినీతి అనకొండ పై విచారణలో ఆలస్యం ఎందుకు???
👉టీటీడీ ఈవో మౌనం వహించడంలో అర్థం ఏమిటి?
👉మాయావి కథనంపై టీటీడీ ఉద్యోగుల్లో హర్షం
తిరుమల మే 25 మాయావి న్యూస్:✍️
నిబంధనలకు విరుద్ధంగా ఆర్టిసి సంస్థ నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి డిప్యూటేషన్ పై వచ్చి అక్రమ నియామకంతో.. శాశ్వతంగా తిష్ట వేసుకొని 20 ఏళ్ల పాటు రవాణా విభాగానికి జనరల్ మేనేజర్ గా కొనసాగిన శేషారెడ్డి తన విధి నిర్వహణలో అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడి స్వామివారికి దాతలు విరాళంగా అందించిన కోట్లాది రూపాయల వాహనాలను ఎందుకూ ఉపయోగం లేకుండా చేసి రెండు కోట్ల విలువైన ఎలక్ట్రికల్ కార్లను వైసిపి పెద్దలకు అప్పనంగా అప్పజెప్పేసి తన స్వామి భక్తిని చాటుకున్న శేషారెడ్డి అక్రమాలపై మాయావి దినపత్రికలో ప్రచురితమైన కథనం టిటిడి లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రవాణా విభాగంలో పని చేస్తున్న టిటిడి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అనేకమంది హర్షం వ్యక్తం చేశారు. శేషారెడ్డి అవినీతి దేవుడి సొమ్ము దుర్వినియోగం వ్యవహారాలపై శ్రీవారు నేత్రాన్ని సారిస్తారని అలాంటప్పుడే ఇలాంటి అవినీతిపరుల గుట్టు రట్టు అవుతుందని ఉద్యోగ సంఘాలు నాయకులు వ్యాఖ్యానించారు.
ఆసక్తికరంగా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న శేషారెడ్డి ఇంతకాలం దేవుడు సొమ్ము తిన్నది చాలదన్నట్లు... మరో రెండేళ్ల పాటు టిటిడిలోనే ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ గా కొనసాగేందుకు అవకాశం ఇమ్మంటూ గతంలోనే రెండుసార్లు టీటీడీ బోర్డు కు విజ్ఞప్తి చేసుకున్నట్లు సమాచారం తెలిసింది. వైసిపి కోవర్ట్ అధికారిగా ముద్ర వేసుకున్న ట్రాన్స్పోర్ట్ జిఎం శేషారెడ్డి కి ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఎక్స్టెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని టిటిడి బోర్డు చైర్మన్ తో సహా సభ్యులందరూ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. అయితే టీటీడీలోని ఒక ఉన్నతాధికారి సహకారం అందిస్తుండడంతో ఆయన అండతో శేషారెడ్డి ప్రభుత్వం వైపు నుండి టీటీడీ పాలకమండలి పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది.
శేషారెడ్డి ఇప్పటివరకు తాను చేసిన అవినీతి అక్రమ వ్యవహారాలు బయటపడకుండా కాపాడుకునేందుకు తన ట్రాన్స్పోర్ట్ విభాగంలోని ఫైళ్ళ సమాచారాన్ని బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసుకునేందుకే మళ్లీ రెండేళ్ల పాటు అదే కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోనే పెద్దల ఆశీస్సులతో ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే శేషారెడ్డి అవినీతి వ్యవహారంపై తొలి నుంచి అనేక ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. తన పైరవీలతో పలుకుబడితో గతంలోనే రెండుసార్లు విచారణను ఎదుర్కొన్న శేషారెడ్డి తనపై ఎటువంటి చర్యలు లేకుండా నిలుపుదల చేయించుకున్నారు.
ఇంత కాలానికి మాయావి కథనంతో బాహ్య ప్రపంచానికి శేషారెడ్డి అవినీతి అనకొండ వ్యవహారం వెలుగు చూడడంతో అనేక వర్గాలు టీటీడీలో రవాణా శాఖలో ఇంతటి అవినీతి జరుగుతోందా అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ శేషారెడ్డి మరో ఐదు రోజుల్లో పదవి విరమణ చేయనుండడం పత్రికలో వెలువడిన కథనంపై టిటిడి కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శాఖపరమైన విచారణకు ఆదేశించాల్సిన ఈవో ఎందుకు మౌనం వహిస్తున్నారు దీని వెనుక ఎవరైనా పెద్దలు పైరవీలు చేస్తున్నారా లేక ఒత్తిడిలు వస్తున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఆయనపై చర్యలు తీసుకునేంతవరకు వదిలిపెట్టేది లేదని టిటిడి రవాణా శాఖ ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
ఎట్టకేలకు టిటిడి జె ఓ వీరబ్రహ్మం బదిలీ....
తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న వీరబ్రహ్మం ఎట్టకేలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరబ్రహ్మం పై కూడా వైసిపి సానుభూతిపరుడని ముద్ర బలంగా వినిపించింది. గతంలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం జరిగిన సందర్భంగా వీర బ్రహ్మం బదిలీ తప్పదని భావించినప్పటికీ ఆయన తన పలుకుబడితో టీటీడీలోనే కొనసాగారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆయన్ను వైసిపి కోవర్టుగానే అనుమానించింది. కానీ బదిలీ చేయడంలో మాత్రం మితిమీరిన నిర్లక్ష్యం ప్రదర్శించింది. అయితే ఇంత కాలానికి వీర బ్రహ్మం ను సీసీఎల్ఏ విభాగానికి బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.