కొండ ఏమైపోతే నాకేంటి.? అడ్డదారిలో షాపులు.. అక్రమంగా తట్టలు.. ప్రక్షాళన లేని పంచాయతీ రెవిన్యూ
కొండ ఏమైపోతే నాకేంటి..?.
🌱 అక్రమంగా నడుస్తున్న షాపులు... హాకర్లు
🌱 తట్టల పేరుతో రాజకీయాలు చేస్తున్న పార్టీలు
🌱 ప్రక్షాళన లేని పంచాయితీ, రెవెన్యూ విభాగం
🌱 భక్తులకు దారులు లేవు..భద్రత పట్టించుకోరు?
🌱టెండర్లు పాడి ఏడాది..తెరుచుకోని హోటల్లు.
కోలా లక్ష్మీపతి /ఎడిటర్ /మాయావి న్యూస్✍️
----------------------------------------------------------
తిరుమల కొండ ఏమైపోతే నాకేంటి... నా పదవిని నా స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.. ఎవరు ఏమైపోయినా నాకెందుకు... ముఖ్యమంత్రి దృష్టిలో మనం సమర్ధుడిగా పేరు తెచ్చుకుంటే చాలు., అందుకోసం చేయాల్సిన జిమ్మిక్కులన్నీ చేసుకుంటూ వెళుతుంటాం... ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అనే ధోరణిలో ప్రస్తుతం టీటీడీ ఉన్నతాధికార వ్యవస్థ పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే?
👉 కొండపై రాగి మాను జంక్షన్, డి ఎం బి రోడ్డు ప్రాంతంలో 1982లో హెచ్ఎంటి వాచ్ కంపెనీకి సంబంధించి 24×20 సైజు షోరూం కోసం టిటిడి స్థలాన్ని కేటాయించింది. కొంతకాలం ఆ కంపెనీ శ్రీవారి బొమ్మలతో ముద్రించిన హెచ్ఎంటి వాచీలను అమ్మకాలు డీలర్ ద్వారా జరిపింది. అటు తరువాత 2014లో తాము శ్రీవారి ప్రతిమలతో కూడిన వాచీల తయారీలో నిలిపేసామని, ఇకపై తమకు తిరుమల లో ఉన్న షో రూమ్ అవసరం లేదు అని వెంటనే టిటిడి స్వాధీనం చేసుకోవచ్చు అని లిఖితపూర్వకంగా లేఖను అందించారు. టిటిడి రెవెన్యూ విభాగం అధికారులకు కూడా అప్పుడే ఆ షోరూం ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో కూడా నమోదు చేశారు. అంతా బాగానే ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకు ముందు వరకు, హెచ్ఎంటి డీలర్ గా వ్యవహరించిన ఏ విజయ రాఘవన్ అనే వ్యక్తి స్థానికంగా ఉంటూ ఇదే షోరూమ్ అప్పటి నుంచి అనధికారికంగా నిర్వహించుకుంటూనే ఉన్నారు.
అతన్ని డీలర్ స్థానం నుంచి తొలగించామని కంపెనీ టీటీడీకి లెటర్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ సహకారం అందించారో తెలియదు గానీ... ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారాయో తెలియదు కానీ.. అప్పటినుండి సుమారు 14 ఏళ్ల పాటు ఈ షో రూమ్ ఎటువంటి అద్దె చెల్లించకుండా అనధికారికంగా తిరుమల కొండపై నడిపారు. చివరకు 2024 డీలర్ విజయరామన్ చనిపోయిన తర్వాత అతని భార్య ఏ నిర్మల అనే మహిళ ఈ షో రూమ్ లైసెన్స్ తన పేరిట మార్పు చేయాలని టీటీడీ కి దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తు తో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏ మోహన్ సిఫార్సులేఖ కూడా అందించింది.
అప్పటికి చేరుకున్న టీటీడీ రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎట్టకేలకు మొన్నటి రోజు అంటే 25/05/2026 తేదీన సోమవారం ఈ దుకాణంపై ఎవరికి ఏ హక్కులు లేవంటూ ఇంతకాలం ఆక్రమణలోనే ఉందంటూ షోరూంను సీజ్ చేశారు. అంటే నాకు 12 ఏళ్ల పాటు అక్రమంగా షోరూంను టీటీడీకి ఒక్క రూపాయి చెల్లించకుండా ఒక అనధికారిక వ్యక్తి అంటే ఏ హక్కు లేని వారు అనుభవించారు అంటే ఈ తప్పు ఎవరిది... ఎలా జరిగింది. ఎవరు బాధ్యత వహిస్తారు.. టిటిడి పంచాయతీ రెవెన్యూ అధికారులకు తెలియకుండానే ఇంతకాలం ఈ వ్యవహారం నడిచిందా...???
👉 సరిగ్గా ఇదే డిఎంబి రోడ్డు ప్రాంతంలో డాక్టర్ రామయ్య నిర్మల అనే దంపతులకు షాప్ నెంబర్ సెవెన్ ఉండేది. కాలక్రమంలో ఈ దంపతులిద్దరూ కాలధర్మం చెందగా వారసులు ఎవరూ లేని ఆ దుకాణాన్ని టిటిడి స్వాధీనం చేసుకోకుండా స్థానికంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారికి రెవెన్యూ పంచాయతీలోని అధికారులు అప్పజెప్పినట్లు సమాచారం ఉంది. ఆ వ్యాపారి రెవెన్యూ అధికారులకు నెలనెలా లక్షల రూపాయల్లో లంచాలు ముట్టజెప్పి చనిపోయిన దంపతులకు వారసురాలిగా మరో మహిళను రంగంలోకి దించినట్లు తెలిసింది. మొత్తం మీద ఆశ్చర్యకరంగా నాలుగేళ్ల పాటు ఈ దుకాణాన్ని టిటిడి రెవెన్యూ విభాగం అండదండలతో అనధికారికంగా ఓ వ్యక్తి లీజుకు ఇచ్చుకుని లక్షల రూపాయలు దండుకున్నాడు అంటే పరిస్థితి ఎంత దిగజారి ఉందో అర్థం చేసుకోండి. చివరకు రెండు మాసాల ముందు ఈ దుకాణాన్ని సీజ్ చేశారు.
👉 విజయ డైరీ అనే సంస్థ కొన్నేళ్ళ క్రితమే తిరుమలలో మూడు దుకాణాలను కేటాయించకుంది. ఈ షాపులను కొన్నేళ్లపాటు నిర్వహించింది. అటు తరువాత కొండపై తమ విక్రయాలను నిలిపివేసింది. అయినప్పటికీ అప్పట్లో ఏజెంట్లుగా చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు ఈ దుకాణాలను టీటీడీకి స్వాధీనం చేయకుండా ఈనాటికి బినామీలుగా హక్కుదారులుగా లక్షలాది రూపాయల వ్యాపారాలు నిర్వహించుకుంటూ టీటీడీకి మోసం చేస్తున్నారు. ఇవన్నీ రెవెన్యూ పంచాయతీ విభాగానికి తెలిసిన అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
👉 ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 500 మంది అనధికారిక ఆఖరులు కొండపై తట్టలు పెట్టుకుని రోడ్డంతా ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో వైసిపి కార్యకర్తలకు రాజకీయ పునరావాసంగా ఏర్పాటు చేసిన ఈ తట్టలు నేటికీ అలాగే కొనసాగిస్తున్నారు. పైగా దీన్ని అధికారికంగా అడ్డదారిలో అనుమతించేందుకు అధికారులే సహకారం అందిస్తూ పాలకమండలిని సైతం పక్కదారి పట్టిస్తున్నారు. వీటిని ఇలాంటి ఆక్రమణలను వెంటనే తొలగించాలని రెండేళ్లుగా తిరుమల పరిరక్షణ సైన్యం నాయకులు అటు ప్రభుత్వానికి ఇటు టీటీడీకి విన్నపాలు అందిస్తూ పోరాడుతున్నప్పటికీ అదేదో వారి వ్యక్తిగత సమస్య అన్నట్లు ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
👉 కొండపై యాత్రికుల సౌలభ్యం కోసం దాదాపు పది క్యాంటీన్లను టెండర్ల ద్వారా టిటిడి పంచాయతీ రెవెన్యూ విభాగం కొన్ని సంస్థలకు అప్పగించింది. ఈ టెండర్లు పూర్తయి ఏడాది గడుస్తున్నప్పటికీ అస్తవ్యస్తంగా నిర్వహించిన పరిస్థితి కారణంగా ఒకటి రెండు హోటల్లో తప్ప మిగతావన్నీ ఇంకా రిపేర్ల పేరుతో ఓపెన్ చేయడం లేదు. ఈ టెండర్ల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని కొంతమంది స్థానాన్ని ఆశ్రయించారు. ఒకటి రెండు హోటల్లు తమకు కావలసిన వారికి అడ్డదారులు కట్టబెట్టారని హోటల్ నిర్వాహకులు న్యాయస్థానం వద్ద వేసిన పిటిషన్లు ఆరోపించారు. ఏమైనప్పటికీ ఏడాదికాలంగా కనీసం హోటల్స్ కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంలో పంచాయతీ రెవెన్యూ విభాగం పూర్తిగా విఫలమైంది.
👉 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి దర్శనం కోసం విచ్చేసే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న దృష్ట్యా టిటిడి మాస్టర్ ప్లాన్ 1982 నుంచే అమలు చేసింది. అప్పటికే తిరుమల కొండపై వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్న స్థానికులను గుర్తించి వివిధ రూపాల్లో ప్రత్యామ్నాయం నివాస గృహాలు, జీవనోపాధి కింద షాపులు, మరికొందరికి హాకర్ల పేరుతో తట్టలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2014 ఏడాదికే పూర్తయ్యాయి. అప్పటివరకు ఈవోలు జేయిఓలు గా పనిచేసిన ఐఏఎస్ అధికారులు తిరుమల స్థానికులు అందరికీ ఏదో రూపంలో ప్రత్యామ్నాయం కల్పించి జీవనోపాధి ఏర్పాటు చేశారు. ఆర్ బి సెంటర్ పేరుతో ఉన్న 82 మంది నివాసస్థులను మినహాయించి, ఇకపై భవిష్యత్తులో కూడా స్థానికులు ఎవరికీ దుకాణాలు, హాకరు లైసెన్సులు, ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా క్లియర్ గా ఫైళ్ళు రాసేశారు. అప్పటికి టిటిడి రెవెన్యూ పంచాయతీ విభాగం లో అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం తిరుమలలో 712 షాపులు, 360 హాకరు లైసెన్సులు, కొండపై బాలాజీ నగర్ లో 1064 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.
👉 అప్పటివరకు పని చేసిన అధికారులు అందరూ కూడా ఎంతో కొంత నిజాయితీగానే పని చేస్తూ.. అంతర్గతంగా ఎన్ని తప్పులు చేసినప్పటికీ.. అంతిమంగా తిరుమల క్షేత్ర పవిత్రతను దృష్టిలో ఉంచుకొని భగవంతుడు ఆస్తులను కాపాడుతూ భక్తుల భద్రతను పరిరక్షిస్తూ.. భగవంతుడి వద్ద భయంతో పనిచేశారు. ముఖ్యంగా సేవా దృక్పథంతోనే విధి నిర్వహణలో మెలిగారు.. కాబట్టి తిరుమల కొండపై షాపులు తట్టలు కోసం ఎంత పైరవీలు, ఒత్తిడిలు వచ్చినప్పటికీ ఏమాత్రం లెక్కచేసుకోకుండా గట్టిగా నిలబడి నియంత్రణ పద్ధతిని పాటించారు. కాబట్టి కొండపై భక్తుల భద్రతతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా నిలబెట్టగలిగారు.
👉 కానీ ఇప్పుడున్న అధికారులు అప్పటి అధికారుల త్యాగాలను గుర్తించడం లేదు. తిరుమల పరిస్థితులను ఏమాత్రం పాటించడం లేదు. కొండ మొత్తం తట్టలతో నిండిపోతున్నా తొలగించే నాధుడే లేడు. యాత్రికులకు నడిచేందుకు దారులు లేకుండా అడుగడుగునా తట్టలు పెట్టేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతేకాదు చివరకు కొన్ని దుకాణాలను ఏళ్ల తరబడి అక్రమంగా చొరబడి నిర్వహించుకుంటున్నా కూడా..తమకేమీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నారు. ఉన్నతాధికారుల ఉదాసీనత రాజకీయ పార్టీలకు నాయకులకు ఒక వరం లా మారింది. తమ అనుచరులకు రాజకీయ ప్రయోజనాలను కల్పించే విధంగా కొండపై తట్టలు పెట్టించాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు..
👉 ఈ ఒత్తిడి లను అధికారికంగా అంగీకరించని ఉన్నతాధికారులు పరోక్షంగా ఎవరికి వారు తట్టల పేరుతో చిన్నచిన్న దుకాణాలను రోడ్డు పొడవునా ఏర్పాటు చేసుకుంటూ పోతుంటే చూసి చూడనట్లు వదిలేశారు. ఇలా వదిలేయడం కారణంగానే వారి నిర్లక్ష్యానికి ఫలితంగా ఇప్పుడు కొండపై అధికారికంగా 719 హాకరు లైసెన్సులు ఉంటే, అనధికారికంగా 500 వరకు తట్టలు వెలిశాయి. గత వైసిపి ప్రభుత్వ హయాం నుండి ఈ అనధికారిక తట్టలు కళ్ళెదురుగా ఆక్రమించుకునే వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ టిటిడి రెవెన్యూ పంచాయతీ అధికారులు వాటిని తొలగించే సాహసం ఏమాత్రం చేయడం లేదు. పైగా ఇలాంటి వాటిని అధికారికంగా రెన్యువల్ చేసేందుకు బోర్డులో తీర్మానాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా తెరవెనుక పెద్ద ఎత్తున చేతులు మారుతున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి అనధికారిక హాకరులను ప్రోత్సహిస్తున్న కారణంగా అప్పుడప్పుడు వారి మధ్య గొడవలు, హత్యాయత్నాలు, జరిగి శాంతి భద్రతల సమస్య కూడా తిరుమల కొండపై ఏర్పడడం భక్తుల్లో భయభ్రాంతులను కలిగించడం జరుగుతోంది. నిజమైన స్థానికుల విషయంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజూ తలెత్తలేదు.
👉 గతంలో తిరుమల కొండపై ఒక చిన్న తట్ట అనధికారికంగా ఎవరైనా పెడితే వెంటనే టిటిడి రెవెన్యూ పంచాయతీ విభాగాలన్నీ కలిసిన టాస్క్ ఫోర్స్ వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి అప్పటికప్పుడు దాన్ని తొలగించడమే కాకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేది. కేసులు నమోదు చేసేవారు. దీంతో ఎవరైనా సరే కొండపై అనధికారికంగా వ్యాపారం నిర్వహించుకోవాలంటే స్థానికులైన సరే వారికి ఒక రకమైన భయం ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేదు. స్థానికేతరులే కాకుండా ఇతను ప్రాంతాల్లోని నేరస్తులు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లు వివిధ నేరాలకు పాల్పడిన గుండాలు రౌడీలు ఆకతాయిలు వికృతి చేష్టలు చేసే యువకులు అందరూ కొండపై తట్టలు పెట్టేస్తే చాలు అనే విధంగా తయారయ్యారు.
👉 రాజకీయంగా ప్రయోజనం కోసం తహతహలాడే రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి నేర ప్రభావం కలిగిన వారందరికీ కొండపై తట్టలు పెట్టిస్తూ వారికి పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తున్నారు. వీరందరినీ గుర్తించి కొండపై ఎటువంటి భద్రతా సమస్య లేకుండా చూడాల్సిన విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం ఆ పని చేయడం లేదు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల క్యూ లైన్ లను నిర్వహించడమే తమ బాధ్యత అన్నట్లుగా విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం తయారయింది. పోలీసులు విఐపి లకు భద్రత కల్పించడం... వారికి దర్శనం అకామిడేషన్ కల్పించడం వరకే పరిమితమయ్యారు.
👉 అసలు టాస్క్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరించాల్సిన టిటిడి పంచాయితీ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది, స్థానిక అనధికారిక వ్యాపారస్తులతో కుమ్ముకై వారిచ్చే లంచాల కోసం చేతులు చాస్తూ తిరుమల ప్రయోజనాలను తాకట్టు పెట్టి టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. కనీసం ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన ఉన్నతాధికారులు ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. గత వైసిపి హయాంలో రెవెన్యూ అధికారిగా ఉండి కోట్లాది రూపాయలను లంచాలుగా తీసుకుని తిరుమల కొండను నాశనం చేసిన ఓ అధికారిని ఆరు నెలల పాటు విధులకు దూరంగా ఉంచారు. అవినీతికి పాల్పడిన ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తిరిగి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో నియమించారు. అయితే ఆ స్థానంలో ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ ఏయీవోగా నియమించలేదు. మరోవైపు టాస్క్ ఫోర్స్ ఏఈఓ గా మరో అధికారి పని చేసి మూడు నెలల క్రితమే రిటైర్డ్ అయినప్పటికీ ఆ స్థానంలో ఇంకెవరిని నియమించలేదు.
👉 మరోవైపు టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ హోదాలో పని చేస్తున్న అధికారి ని ఆయన పనితీరు సరిగా లేదంటూ ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానాన్ని నాలుగు మాసాలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఉన్నతాధికారులు అమలు చేయకుండా అదే అధికారిని స్థానంలో కొనసాగిస్తూ తమ వెంట తిప్పుకుంటున్నారు. పాలకమండలి తీర్మానాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒకవేళ అదే అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయడం ఇష్టం లేకపోతే పాలకమండలి తీర్మానాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి అది కూడా జరగలేదు.
👉 ఇంకా మరికొన్ని స్థానాల్లో కింది స్థాయి సిబ్బంది కొరత కూడా అలాగే ఉండిపోయింది. ఎంతో కీలకమైన టిటిడి పంచాయతీ రెవెన్యూ విభాగానికి కావలసిన అధికారులను సిబ్బందిని నియమించడంలో ఉన్నతాధికారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని అర్థమవుతుంది.