కొండపై 57 టెండర్ షాపులకు టీటీడీ నోటీసులు...
కొండపై 57 టెండర్ షాపులకు నోటీసులు
3 రోజుల్లోగా ఖాళీ చేయాలని అధికారుల ఆదేశాలు
దశాబ్దాల తరబడి నిర్వహించుకుంటున్న తమకే కేటాయించాలని అభ్యర్థిస్తున్న స్థానికులు
తిరుమల జూన్ 2 మాయావి న్యూస్:
దాదాపు 30 సంవత్సరాల నుండి నిర్వహించుకుంటున్న 57 టెండర్ దుకాణాల లైసెన్స్ గడువు ముగిసిపోయిందంటూ టీటీడీ రెవెన్యూ విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల సమయంలో గా ఈ దుకాణాలన్నింటిని టెండర్ దారులు ఖాళీ చేయాలని షోకాజ్ నోటీసులు అందించారు. దీంతో ఈ షాపులు నిర్వహించుకుంటున్న స్థానికులు అందరూ ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల తరబడి జీవనోపాధిగా నడుపుకుంటున్న ఈ షాపులను ఉన్నఫలంగా ఖాళీ చేస్తే తమ బతుకులు ఏమైపోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల స్థానికులైన తమకు ఈ షాపులను రెన్యువల్ చేసి ఆదుకోవాలని వారంతా మంగళవారం ఉదయం టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి విన్నవించుకున్నారు. అయితే ఈ విషయంలో తాము నిస్సహాయులమని ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు కోర్టులో కేసు నడుపుతున్నందున వ్యాపారులంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుకూల ఆదేశాలు తీసుకొచ్చుకోవాలని ఆయన దుకాణదారులకు సూచించారు.
వాస్తవానికి మూడు దశాబ్దాలకు పైగా ఈ టెండర్ దుకాణాల వ్యవహారం నలుగుతోంది. తొలుత మూడేళ్ల పాటు టెండర్ పాడుకున్న వ్యాపారులు గడువు ముగిసిన తర్వాత ఈ దుకాణాలను ఖాళీ చేయాల్సి ఉంది. అయితే అప్పట్లో అధికారులు టిటిడి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో దశాబ్దాలుగా అలాగే కొనసాగారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో 83 టెండర్ షాపులలో 14 షాపులను ఇతర కారణాలతో వేరుచేసి మిగిలిన 57 టెండర్ దుకాణాలను దాదాపు 20 ఏళ్ల పాటు పేరుకుపోయిన బకాయిల అద్దెలను ఒకేసారిగా టీటీడీ రెవెన్యూ విభాగం వసూలు చేసింది. ఒక్కో దుకాణదారుడు అద్దెల రూపంలో టీటీడీకి ఒకేసారి 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించారు.
ఇంత చెల్లించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏడాది కాలం పాటు మాత్రమే ఈ షాపులను రెన్యువల్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అటు తరువాత కూటమి ప్రభుత్వం రాగానే కొండపై వ్యాపారులు నిర్వహించుకుంటున్న 57 టెండర్ దుకాణాలను వాటి లైసెన్సుల గడువు ను మరో ఆరు మాసాల పాటు కొనసాగిస్తూ 2025లో ఆమోదం తెలిపారు. దశాబ్దాల తరబడి తిరుమల స్థానికులు నిర్వహించుకుంటున్న ఈ టెండర్ దుకాణాల రెన్యువల్ గడువు మూడేళ్ల పాటు కొనసాగించాలని ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా... ఈ దుకాణాల్లో స్థానికులే ఉంటున్నారా లేక పరాధీనం అయ్యాయా.. టెండర్ షాపులను చాలా ఏళ్ల క్రితమే ఖాళీ చేయించాల్సింది పోయి ఇప్పటిదాకా రెన్యువల్ చేయడంలో కారణాలేమిటి..!? అనే అంశంపై పూర్తి సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలను టిటిడి బోర్డు కు నివేదించాలని ప్రస్తుత చైర్మన్ బి ఆర్ నాయుడు ఆదేశించారు. అప్పటిదాకా తాత్కాలికంగా ఆరు మాసాల పాటు ఈ దుకాణాల లైసెన్సుల రెన్యువల్ చేస్తున్నట్లు ఆమోదించారు.
ఈ గడువు కూడా మూడు రోజుల క్రితం అంటే మే 31 వ తారీకు గడువు ముగిసిపోయింది. చివరి క్షణాల్లో చేరుకున్న టీటీడీ రెవెన్యూ పంచాయతీ అధికారులు ఈ షాపులకు కనీసం రెండు వారాల ముందు అయినా నోటీసులు జారీ చేయాల్సి ఉండగా కేవలం ఒకరోజు ముందుగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఈ షాపులు కనుక ఖాళీ చేయిస్తే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుమల కొండపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికులకు సంబంధించిన ఒక చిన్న సమస్య కూడా పరిష్కారం నోచుకోవడం లేదు. అధికార వ్యవస్థ స్థానికులకు సంబంధించిన ఫైల్స్ ఎక్కడికక్కడ పెండింగ్లో ఉంచేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా తిరుమల వాసులు ముఖ్యంగా వ్యాపారులు రకరకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నానుడి ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. తట్టలు, హాకర్లు, దుకాణాలు, ఆక్రమణలు, అంటూ కూటమి ప్రభుత్వంలోని అధికారులు స్థానికులపై నిరంతరం దాడులు నిర్వహించడం, జీవనోపాధికి ఆటంకం కలిగించేలా నిబంధనలు విధించడం, పరిపాటిగా మారిపోయిందని తిరుమల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మళ్లీ ఈ 57 దుకాణాలను ఖాళీ చేయాలంటూ టెండర్ షాపు నిర్వాహకులపై నోటీసులు పేరుతో చర్యలు పూనుకోవడం ఏ పరిస్థితికి దారితీస్తుందో ఎదురు చూడాల్సింది.