తిరుమల కొండపై పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడమే ధ్యేయం.. శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి నుండి వెలుపలికి రావడానికి ప్రత్యామ్నాయం అవసరం. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర.
తిరుమల కొండపై పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడమే ధ్యేయం
శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి నుండి వెలుపలికి రావడానికి ప్రత్యామ్నాయం అవసరం
తిరుపతిలో 25వేల మంది భక్తులకు ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ద్వారా బసవసతి
శ్రీవారి ఆలయంలో 80,వేల మంది భక్తులకు మించి దర్శనం కల్పించే అవకాశం లేదు
ఆర్జిత సేవలన్నీ ఏకాంతం... ఆ సమయంలో సామాన్య భక్తులకు దర్శన అవకాశం..
టీటీడీలో భక్తుల అవసరాలకు తగిన స్థాయిలో శాశ్వత ఉద్యోగాల భర్తీ
శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ నుండి దేవాదాయ శాఖకు విస్తరించే ప్రణాళిక
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానానికి ఆచరణ సాధ్యం దిశగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర భవిష్యత్ ప్రణాళిక
కోలా లక్ష్మీపతి / ఎడిటర్ /మాయావి న్యూస్:
1982 వ ఏడాదికి ముందు తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం గొల్ల మండపానికి మధ్య కేవలం ఆరడుగుల స్థలం మాత్రమే గ్యాప్ ఉండేదని విన్నాను. మరి అప్పట్లో శ్రీవారి రథోత్సవం జరపాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. టిటిడిలో మొట్టమొదటగా అభివృద్ధి అనే ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చింది అప్పట్లో పి వి ఆర్ కె ప్రసాద్ గారని విన్నాను. ఈ 40 ఏళ్లలో తిరుమల ఎంతగా అభివృద్ధి చెందిందో అదే విధంగా భవిష్యత్తులో మరో 20 ఏళ్ల తర్వాత తిరుమల ఆధ్యాత్మిక కేంద్రం ఏ విధంగా ఉండాలో భవిష్యత్తు ప్రణాళికను ఊహించి ఎలా అభివృద్ధి చేయాలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన విధానంతో ఉన్నారు. భవిష్యత్తులో తిరుమల కొండపై అడుగుపెట్టే భక్తుల్లో పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక భావన తప్ప ఇతర ఆలోచనలకు తావు లేకుండా.. భక్తుల్లో ప్రశాంతమైన భక్తి పూర్వకమైన పూర్తి ఆధ్యాత్మిక తన్మయత్వం అణువణువునా స్పురించేలాగా వాతావరణం ఏర్పరిచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలో స్పష్టంగా ఆదేశించారు. ఆయన ఆలోచనను అమలు చేసే దిశగా ప్రణాళిక బద్ధంగా ముందడుగు వేస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
బుధవారం ఆయన మాయావి దినపత్రిక ఎడిటర్ కోలా లక్ష్మీపతి తో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భవిష్యత్తులో కల్పించాల్సిన సౌకర్యాలు, బస వసతి, దర్శన పరిస్థితి, అన్నింటిని పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకున్నామన్నారు. భవిష్యత్తులో తిరుమలలో కొత్తగా కట్టడాలు ఏవి నిర్మించకుండా ఇకపై తిరుపతిలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దాదాపు 25 వేల మంది భక్తులకు అలిపిరి సమీపంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. తిరుమల లో ఇటీవల జరిగిన కల్తీ నెయ్యి లడ్డు ప్రసాదాల నాణ్యత వ్యవహారాలపై వాస్తవాలను భక్తులకు వివరించే క్రమంలో అనవసరంగా తిరుమల పవిత్రతను స్వయంగా దెబ్బతినేలా వ్యవహరిస్తున్నామేమోనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరాలోచనలో పడిన కారణంగా ప్రస్తుతం టీటీడీలో పూర్వపు పరిస్థితిని నెలకొల్పే విధంగా వ్యవహరిస్తున్నామన్నారు.
కొండపై ఇప్పటికే 7200 కాటేజీలు అందుబాటులో ఉన్నాయని వీఐపీ అతిథి గృహాలు సామాన్య భక్తుల వెయిటింగ్ హాల్స్ అన్నీ కలుపుకుంటే దాదాపు 68 వేల మందికి భక్తులకు అకామిడేషన్ అందుబాటులో ఉందని ఈవో వెల్లడించారు. ఇక ఇకపై తిరుమల కొండపై కొత్తగా అతిథి గృహాలు కాటేజీలు నిర్మించే అవకాశం లేకుండా తిరుపతిలోనే భక్తులకు కావలసిన మేరకు సకల సదుపాయాలు కల్పించి భగవంతుడు దర్శనానికి మాత్రమే తిరుమలకు వెళ్లేలా పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామన్నారు. అది కూడా కొండపై చల్లటి వాతావరణంతో పాటు శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నివారించి అందుకు తగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి, కొండపై ఉన్న చల్లటి సహజ వాతావరణాన్ని తిరిగి పరిరక్షించేందుకు భక్తులకు దివ్యానుభూతి కలిగించేలా భక్తి పూర్వకమైన చల్లటి వాతావరణాన్ని నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అయినా సిద్ధపడతామన్నారు.
ఇటీ వల కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం పై రకరకాలైన ఊహాగానాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం చాలా బాధ కలిగిస్తుందని ముద్దాడ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
అయితే శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు వాటిని ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు కల్పిస్తున్న దర్శనాన్ని సమయాలను పూర్తిస్థాయిలో అంచనా వేస్తే ఆర్జిత సేవలు అన్ని ఏకాంతంగా జరిపించి అవి జరిపిస్తూనే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. దీని ద్వారా ఆ సమయంలో ప్రతిరోజు 10,000 మంది భక్తులకు అదనంగా భగవంతుడు దర్శనాన్ని కల్పించే పరిస్థితి ఉంటుందన్నారు. మరోవైపు ప్రతిరోజు 80,000 మంది భక్తుల కంటే మించి స్వామివారి దర్శనాన్ని కల్పించే అవకాశం లేదన్నారు. అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు కానుకలు సమర్పించే హుండీ వద్దనుండి వెండి వాకిలి దాటుకొని ప్రసాదాల వద్దకు రావడానికి భక్తులకు చాలా కష్టంగా తయారైంది అన్నారు. వెలుపలకి రావడానికి ఇరుకైన మార్గం ఒక్కటే ఉండడం కారణంగా ఏళ్ల తరబడి సమస్యను ఎదుర్కొక తప్పడం లేదన్నారు. స్వామి వారి దర్శనం వేగంగా పూర్తి కావడం ఒక ఎత్తు అయితే అక్కడి నుండి వెలుపలికి రావడం పద్మవ్యూహంలా తయారయింది అన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వెండి వాకిలి వద్ద మరో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేయకపోతే భవిష్యత్తు క్షమించదన్నారు. దీనిపై స్వామీజీలు ఆగమపండితులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ ఏకతాటిపై వచ్చి సమస్యకు పరిష్కారం చూడాలన్నారు.
తాను గత 30 మాసాలుగా ప్రతి నెల తిరుపతికి వచ్చి సామాన్య భక్తుడిలాగా స్వామివారి కొండకు నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ వచ్చాను అన్నారు. అంతేకాకుండా టీటీడీ ఈవోగా కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత సమయం గ్యాప్ దొరకగానే కొండపై క్యూలైన్లు రిసెప్షన్ కేంద్రాలు అనేక కీలక ప్రదేశాలకు తాను ఒక్కడినే ఎవరికి చెప్పకుండా తానెవరో తెలియకుండా సామాన్య భక్తులతో పాటు వెళ్లి క్యూ లైన్ లలో నిల్చుని భక్తులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో స్వయంగా పరిశీలించి ఆకలింపు చేసుకున్నానని ముద్దాడ రవిచంద్ర వివరించారు.
టీటీడీలో ప్రస్తుతం 6000 మంది శాశ్వత ఉద్యోగులు 13 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని అయితే భక్తులకు అంకిత భావంతో సేవలందించడానికి చాలా ఏళ్లుగా పరిష్కారం కానీ కొన్ని సమస్యలను త్వరలో పరిష్కరించడానికి ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందన్నారు. అందులో ముఖ్యమైనది టీటీడీలో భక్తుల అవసరాలకు అనుగుణంగా కావలసిన మేరకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారని ఆ మేరకు త్వరలో నియామకాలు జరుగుతాయని వివరించారు. వచ్చే నెలలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 60 మంది పైగా ఇంజనీర్ల నియామకం రాత పరీక్షలు జరుగుతాయని చెప్పారు. దశలవారీగా వీలైనంత త్వరలో అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
భక్తులకు సేవలు అందించే క్రమంలో శ్రీవారి సేవకులు చేస్తున్న కృషిని ముద్దాడ రవిచంద్ర మరింతగా విస్తరించి టీటీడీలోనే కాకుండా శ్రీవారి సేవకుల సేవలను ప్రభుత్వ ఆధీనంలోని దేవాదాయ శాఖకు కూడా విస్తరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 వేల దేవాలయాలను వాటితో పాటు నూతనంగా నిర్మిస్తున్న మరో 5 వేల దేవాలయాలలో శ్రీవారి సేవకుల సేవలను నిరంతరం వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. శ్రీవారి సేవకులు దేవాదాయ శాఖ ఇటు టిటిడిలోనే కాకుండా ఆయా ప్రాంతాల్లో వారు ఉంటున్న దేవాలయాలలోనే నిరంతరం సేవలందిస్తూ వారికి రేటింగ్ రూపొందించేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ముద్దాడ రవిచంద్ర వివరించారు. దీని ప్రకారం రేటింగ్ ఆధారంగా శ్రీవారి సేవకుల పనితీరును వారి సమర్థతను గుర్తించి అలాంటి వారికి శ్రీవారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రథసప్తమి లాంటి ప్రముఖ ఉత్సవాలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వివరించారు.