42 ఏళ్లుగా కుంట పోరంబోకు అంటూనే ఉన్నారు.. ఇంటి స్థలం కోసం అలుపెరుగని వృద్ధ జర్నలిస్టుల పోరాటం.. ప్రభుత్వాలు మారినా పనికిరాని వాళ్ళ లిస్టులోనే ప్రెస్సోళ్ళు
ఇంటి స్థలం కోసం 42 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తుంది ఐదు మంది జర్నలిస్టులు
కాసులు ఇవ్వలేదని 42 ఏళ్లుగా కుంట పోరంబోకు అంటూనే ఉన్నారు....
ఇంటి స్థలం కోసం 42 ఏళ్లుగా 5మంది జర్నలిస్టుల పోరాటం
20 మందిలో 15 మందికి ఇచ్చారు ఐదు మందికి దశాబ్దాల తరబడి చుక్కలు చూపిస్తున్నారు.
తమ ప్రాణం పోయే లోపు అయినా స్థలం ఇస్తారా అంటూ వేడుకుంటున్న వృద్ధ జర్నలిస్టులు
కోలా లక్ష్మీపతి /ఎడిటర్/ మాయావి న్యూస్ ✍️
----------------------------------------------------------
వారిది నిజంగా ఒక స్వాతంత్ర పోరాటం అనుకోవచ్చు. నిత్యం అధికారులతో ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ వారిచ్చే స్టేట్మెంట్లను ప్రజలకు వార్తల రూపంలో అందజేస్తూ దశాబ్దాల తరబడి జర్నలిజం అనే మాయలో పడి, కుటుంబ వ్యవస్థకు దూరమై... ఆర్థికంగా పతనమై... అన్నిటికంటే ముఖ్యంగా వయోభారం మీద పడుతున్నా.. ఇంకా చిగురిస్తున్న ఆశలతో కనీసం తమ ప్రాణాలు కోల్పోయినా.. కూడా తమ కుటుంబ సభ్యులైనా.. సొంత ఇంటి కలను సాకారం చేసుకోగలుగుతారేమోననే ఆశ వాళ్ళని 46 ఏళ్లుగా పోరాటం చేయనిస్తోంది.
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ సొంత ఇంటి స్థలాలను సాకారం చేస్తామంటూనే గత రెండు దశాబ్దాలుగా మీడియా ప్రతినిధులను ఊరిస్తున్న ముఖ్యమంత్రులు చివరకు ప్రెస్ వాళ్ళను కూడా పనికిమాలిన వాళ్ళ లాగానే లెక్క కట్టేశారు. మహా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సొంత ఇంటి స్థలాలు పొందలేని 24 వేల మంది జర్నలిస్టులు ఉంటారు. అందులో తిరుపతి జిల్లాలో అయితే కనీసం వందల సంఖ్యలోనే ఎదురుచూస్తున్నారు. అంతకు ముందు రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు కాలయాపనతోనే జర్నలిస్టులకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వకుండా నానబెట్టేశారు. అటు తరువాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలన పూర్తి చేసుకుంటూ చివర దశలో ఒక నెల గడుపు ఉండగా తాము జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామంటూ సమాచార శాఖ అధికారుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. అంతే ఎన్నికలు వచ్చేసాయి షరా మామూలుగా జర్నలిస్టులను వాడుకోవడమే పనితనం చూపించారు. రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ జర్నలిస్టులకు మంచి రోజులు అంటూనే మంత్రులు చేస్తున్న స్టేట్మెంట్లతోనే ఏళ్లు గడిచిపోతున్నాయి. ఏడుస్తున్న బిడ్డకు ఎలక్కాయ చూపించిన విధంగా జర్నలిస్టులకు ఆశలతోనే ఏళ్ల తరబడి ఊరిస్తూనే కాలం నడిపిస్తున్నారు. ఆచరణ అనేది కనుచూపుమేరలో కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉంటే....
తిరుపతిలో 42 ఏళ్ల నుంచి పంచపాండవుల్లా వనవాసం చేస్తున్న ఐదు మంది జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు పరిస్థితి గమనిస్తే... కనీసం ప్రభుత్వాలకు మానవత్వం ఉందా? రెవెన్యూ అధికారులకు కనికరం ఉండదా..? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ప్రెస్ గిల్డ్ సహకారంతో అప్పట్లో 20 మంది జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎట్టకేలకు 15 మందికి ఇంటి స్థలాలను చదరపు గజం ఒక రూపాయి చొప్పున నామమాత్రపు 330 రూపాయలకు ఐదు సెంట్లు చొప్పున స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించారు. 28 సెంట్లు జాగాని కేటాయించగా, ఇది ప్రస్తుతం తిరుపతి నగరం నడిబొడ్డులో ఉన్న కనక భూషణం లేఅవుట్ లో ఉంది. అప్పట్లో ఏమాత్రం విలువ లేని ఈ స్థలం ఇప్పుడు మాత్రం వద్దంటే అంకణం మూడు లక్షలకు పైగా పలుకుతుంది. 20 మందిలో 15 మందికి కేటాయింపు పూర్తవగా మిగిలిన 5 మందికి సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. అయితే ఐదు మంది జి శ్రీధర్, జి ఆర్ సురేంద్రబాబు, మబ్బు గోపాలరెడ్డి, నాగరాజు రెడ్డి, విశ్వేశ్వరరావు అనే జర్నలిస్టులు అప్పటినుండి అధికారులతో అనేక రూపాలలో విన్నవించుకుంటేనే ఉన్నారు కానీ కనికరించే కలెక్టర్లు లేకపోయారు. పైగా 15 మందికి కేటాయించినప్పుడు రాని అభ్యంతరం మిగిలిన ఐదు మందికి మాత్రం ఇది కుంట పోరంబోకు కాబట్టి కేటాయించడానికి కుదరదు ఒకే అభ్యంతరాన్ని ఏళ్ల తరబడి ఎమ్మార్వోలు ఆర్డీవోలు చెబుతూనే వచ్చారు. అప్పటికే ఇల్లు కట్టుకొని ఇప్పుడు 42 ఏళ్లుగా కాపురాలు చేసుకుంటున్న వారికి మాత్రం కుంట పోరంబోకు అనే అభ్యంతరం లేనప్పుడు ఈ ఐదు మందికి మాత్రం ఎందుకు చెబుతున్నాము అని చిన్న లాజిక్కును కూడా అధికారులు మిస్ అయిపోతున్నారు. ఇలా కాలక్రమేణా..
రెవెన్యూ అధికారుల మాయాజాలంలో పడి ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు 42 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం పాలు పెరుగు గాని పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న పోరాటంలోని కొన్ని వివరాలు ఒకసారి పరిశీలిద్దాం....
ప్రెస్ గ్రిల్డ్ తరపున , తిరుపతి 1980 సం॥న 20 మంది విలేకరులకు ఇంటి నివేశ స్థలం కేటాయించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఇందులో 1981 సం॥న 15 మందికి ఒకొక్కరికి 0.05 సెంట్లు చొప్పున T.S.No: 65 నందు ఫ్లాట్లు కేటాయించారు. మిగిలిన 5 మంది జర్నలిస్టులకు గాను T.S.No: 65/7 .28న కేటాయించవలసినదిగా కోరుతూ కలెక్టర్ వారికి విన్నవించుకోగా.. వారు తిరుపతి తహసీల్దారు వారిని ప్రపోజల్ పంపవలసినదిగా కోరారు. కాని, కొంతమంది జర్నలిస్టులు అదే జాగా నందు తమకు కూడా స్థలము కేటాయించాలని కోరడంతో తిరుపతి ప్రెస్ గ్రిల్డ్ జర్నలిస్టు సభ్యుల కేటాయింపు ఆలస్యమైనది. ఎట్టకేలకు 1984 జనవరి 16వ తేదిన ప్రెస్క్రిల్డ్ జర్నలిస్టు సభ్యులు 5 మందికి 0.05 సెంట్లు చొప్పున T.S.No: 65 ప్రకారము ఇంటి నివేశ స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
కాని, మార్కెట్ రేటు నిర్ధారించకపోవడం వలన ఇంటి నివేశ స్థలం కేటాయింపు ఆలస్యమైనది. ప్రెస్ గిల్డ్ హైకోర్టు ద్వారా డైరెక్షన్ తెచ్చుకున్నప్పటికీ మార్కెట్ రేటు నిర్ధారణ జరగలేదు. ఈలోగా కొంతమంది మాజీ సైనికులు ఆ స్థలమును ఆక్రమించి ఇంజెంక్షన్ ఆర్డర్ పొందారు.
ప్రెసిల్డ్ ఈ ఇంజెంక్షనన్ను వెకేట్ చేసుకోగలిగింది. మొదటి ప్రిన్సిపల్ జడ్జి, ఈ ఇంజెంక్షన్ ఆర్డర్స్ ను ఎత్తివేశారు. ఎక్స్-సర్వీస్మెన్ జిల్లా కోర్టుకు అప్పీలు చేయగా తిరస్కరించబడినది. హైకోర్టు నందు కూడా ఎక్స్-సర్వీస్మెన్ పిటిషన్ న్ను తిరస్కరించబడినది. తదనంతరం ప్రెస్ గిల్డ్ జిల్లా కలెక్టర్ కి ఇంటి స్థలముకు మార్కెట్ రేటు నిర్ధారించమని మరలా కోరగా 2011 సం॥లో తిరుపతి తహసీల్దారు, ఆర్.డి.ఓ.లు ప్రపోజల్స్ పంపించారు.
పలుమార్లు ప్రపోజల్ పంపించినప్పటికీ ఈ స్థలం కుంట పొరంబోకు అయినందున ఇంటి స్థలం కేటాయించలేమని తెలిపినారు. T.S.No: 65 కుంట పొరంబోకు నుండి విలేజ్ సైట్ గా మార్చబడినది. ఇందుకు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ నెం.ఇ5/3744/2003 తేది.30.11.2003న ఉత్తర్వులు ఇచ్చినారు.
G.O.ms.No. 232, Dt: 4.3.2004 2.
తహసీల్దారు, తిరుపతి వారు 3 సార్లు కలెక్టర్ కి ఐదు మంది సీనియర్ జర్నలిస్టులకు T.S.No: 65/7 నందు ఒకొక్కరికి 0.05 సెంట్లు చొప్పున 5 మంది జర్నలిస్టులకు కలెక్టర్ ఆదేశాను ప్రకారం కేటాయించుటకు ప్రపోజల్స్ 2011న, 2019, 2023లోనూ పంపించారు.
ప్రెసిల్డ్ సెక్రటరీ CCLA and Revenue Secretary వారికి, జిల్లా కలెక్టర్ ని క్లారిఫికేషన్ కోరారు. తన లేఖలో TS No.65 కుంట పొరంబోకు నుండి విలేజ్సైట్ క్రింద మారుస్తూ కలెక్టర్ స్వయంగా ఉత్తర్వులు ఇచ్చివున్నారు. కావున సదరు స్థలము కుంట పొరంబోకు ఎలా అవుతుంది అని తన లేఖలో కోరారు. కాని, దానికి సమాధానము ఇచ్చినట్టు లేదు.
ఇదికాక 2014సం॥లో కలెక్టర్ స్వయంగా అదే సర్వే నెం. అనగా 65 సర్వే నెంబరులో ఎ 0.75 సెంట్లు రీజనల్ స్టడీ సెంటర్కు కేటాయిస్తూ, స్టడీ సెంటర్ నిర్మాణము కూడా పూర్తయ్యి పనిచేస్తున్నది. 2018న కలెక్టర్ 0.20 సెంట్లు ప్రెసిల్డ్ నిర్మాణానికి కేటాయింపు కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాశారు, తన లేఖలో ఈ స్థలము కుంట పొరంబోకు నుండి మార్పు చేయబడినది అని స్పష్టముగా తెలిపియున్నారు,
కాని, ఈ మార్పు ఇంప్లిమెంట్ కాలేదు, అనగా విలేజ్ అకౌంట్స్ బుక్కు నందు నమోదు కాలేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వము క్లాసిఫికేషన్ మార్పు చేసిన ఉత్తర్వులు అమలు చేయవలసినదిగా కోరుతూ పలుమార్లు ప్రెసిల్డ్ సెక్రటరీ కోరినప్పటికీ ఫలితం లేదు.
ఆర్.డి.ఓ. తిరుపతి కూడా కలెక్టర్ కి 5 మంది జర్నలిస్టులకు ఇంటి పట్టా ఇవ్వవలసినదిగా కోరుతూ పలుమార్లు అర్జీలుగా విన్నవించుకున్నారు.
అయినప్పటికీ తిరుపతి తహసీల్దారు తమ లేఖ నెం. PGRS/568/2025, Dt: 04.10.2025 న ఈ స్థలమును కుంట పొరంబోకు అయినందున జర్నలిస్టులకు కేటాయించడానికి వీలుపడదని తెలిపినారు.
దీనిపై జర్నలిస్టులు తగిన దస్తావేజులతో సంబంధిత స్థలము (65/7) కుంట పొరంబోకు నుండి విలేజ్ సైట్ గా మార్చబడినది. కావున కలెక్టర్ ఇంతకు మునుపే 0.5 సెంట్లు చొప్పున 5 మంది జర్నలిస్టులకు మంజూరు చేసి వున్నందున మార్కెట్ రేటు నిర్ణయించి ప్రభుత్వానికి పంపవలసినదిగా మరల కోరారు. కాని, ఇప్పటి వరకు తహసీల్దారు స్పందించలేదు. ఈ 46 ఏళ్ల జీవితంలో ఇప్పటికి ఎన్నో కాలనీలు ఏర్పడి కుంట పరంబోకు పోయి అపార్ట్మెంట్లు కట్టేశారు. అయినా ఈ ఐదు మందికి ఇంకా కొంత పరంబోకు అంటూ ఇంకా ఎంత కాలం మభ్యపెడతారో కే తెలియాలి. ప్రస్తుతం వీరి కోసం అక్కడ ఉన్న ఖాళీ స్థలం లో కూడా కొన్ని సెంట్లు కబ్జాకు గురైపోయి ఉంది. కనీసం వాళ్లకోసం ఉన్న స్థలాన్ని అయినా వారికి కేటాయిస్తే అధికారులు వాళ్ళ విధి నిర్వహణకు ఇప్పటికైనా న్యాయం చేసిన వారు అవుతారు.
కనీసం తిరుపతి ఎమ్మెల్యే చొరవచూపి, జర్నలిస్టులకు ఇంటి జాగాను మంజూరు చేయించుటకు జిల్లా కలెక్టర్ కి ఆదేశించవలసినదిగా కోరుకుంటున్నారు.
దాదాపుగా 46 సం॥లుగా ఈ స్థలముకై వేచి వున్నాము. మీరు దయయుంచి మానవతా దృక్పథముతో ఇంటి జాగాను త్వరితగతిన మంజూరుకు ఏర్పాటు చేయగలరని కోరుచున్నాను. ఇట్లు తమ విధేయులు అంటూ ముక్కులిత హస్తాలతో వేడుకుంటున్నారు. ఆ వృద్ధ జర్నలిస్టులు అధికారుల మనసు ఇప్పటికైనా కలుగుతుందేమో చూద్దాం.