గంగమ్మ ఆలయం వేదికగా వైసిపి రాజకీయం.. 30 యాక్ట్ అమలు చేయని పోలీసులు.. తిరుపతిలో టీడీపీ కేడర్ ను చేజేతులారా నాశనం చేస్తున్న చంద్రబాబు

గంగమ్మ ఆలయం వేదికగా వైసిపి రాజకీయం.. 30 యాక్ట్ అమలు చేయని పోలీసులు.. తిరుపతిలో టీడీపీ కేడర్ ను చేజేతులారా నాశనం చేస్తున్న చంద్రబాబు

గంగమ్మ ఆలయం వేదికగా వైసిపి రాజకీయం

 బి ఆర్ నాయుడు ని తొలగించాలంటూ ప్రత్యేక పూజలు

 30 యాక్ట్ అమల్లో ఉన్నా ప్లకార్డులతో వైసిపి ర్యాలీ, బల ప్రదర్శన, పోలీసుల పరోక్ష సహకారం.

 అడ్డుకోవాల్సిన టిడిపి కూటమి శ్రేణులు అడ్రస్ లేరు 

 ఇప్పటికే నాలుగు గ్రూపులుగా తయారైన తిరుపతి టిడిపి శ్రేణులకు అధిష్టానం అడ్డుగీత 

 పార్టీ అధిష్టానం వైఖరిపై టిడిపి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం 

 చంద్రబాబు వైఖరితో తిరుపతిలో టిడిపి మునిగిపోవడం ఖాయం 

 కోలా లక్ష్మీపతి/ ఎడిటర్ /మాయావి న్యూస్:

 తిరుపతి గంగమ్మ ఆలయం వేదికగా రాజకీయ ఆధిపత్య పోరు నడిచింది. పోలీసుల నిబంధనలు, 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం పరిపాలనను సవాలు చేస్తూ తిరుపతిలో సత్తా తమదేనని నిరూపించుకున్నారు. వైసీపీ రాజకీయాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన టిడిపి శ్రేణులు ఏం జరిగిందో తెలియదు గానీ పత్తా లేకుండా పోయారు. గంగమ్మ ఆలయాన్ని రాజకీయ కార్యక్రమాలకు అనుమతించబోమని, రాజకీయ పరమైన పూజలకు అనుమతి లేదని, బీరాలు పలికిన పోలీసులు అదంతా పైపైకేనని నిరూపించి, పరోక్షంగా వైసిపి రాజకీయ బల ప్రదర్శనకు సంపూర్ణంగా సహకరించారు. ఈ రాష్ట్రంలో నడుస్తున్నది కూటమి ప్రభుత్వమా.. లేక వైసిపి ప్రభుత్వమా..?? అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జరిగేలా తిరుపతి గంగమ్మ ఆలయ రాజకీయ సంఘటన ఆలోచింపజేసింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధోరణిని అడ్డుకోలేక చంద్రబాబు సైతం చతికిల పడిపోతున్నట్లు స్పష్టం అవుతోంది.

 రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్, లాంటి అనేక విమర్శలు వివిధ కామెంట్లు చేస్తున్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ వైసిపి వైఫల్యమైన పార్టీగా ప్రజల్లో చిత్రీకరించే విధానంలో కూటమి ప్రభుత్వం ఒక విధంగా సఫలమౌతోంది. కానీ అదే తిరుపతి కేంద్రంగా జరుగుతున్న వైసిపి కుళ్ళు కుతంత్ర రాజకీయాన్ని ఏమాత్రం అడ్డుకోలేక చేతులెత్తేస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆలు పెరుగని ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. అవకాశం దొరక్కపోయినా అవకాశం కల్పించుకొని మరి అడ్డంకులు సృష్టిస్తున్నారు. 

గత ఐదేళ్ల వైసిపి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ లు గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కుంభకోణాల పేరుతో కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. కల్తీ నెయ్యి కుంభకోణం, పరకామణి ఆస్తుల కుంభకోణం, కాంట్రాక్టర్లు 15% కమిషన్ల కుంభకోణం, పట్టు శాలువల పేరుతో కొనుగోళ్ల గోల్మాల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో టి డి ఆర్ బాండ్ల కుంభకోణం, అభివృద్ధి పేరుతో రోడ్ల విస్తరణ పేరుతో కోట్లాది రూపాయల కమిషన్లు, స్వర్ణముఖి నది తీరం వెంట ఎకరాలకొద్దీ దురాక్రమణ, ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతి వైసీపీ నేతల అక్రమాల చిట్టా చేంతాడంతవుతుంది. 

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని, అనేక అక్రమ కేసులు పెట్టించుకుని, తెలుగుదేశం పార్టీ కలలు కన్న అమరావతి అజరామజమైన రాజధానిగా నిలిచేందుకు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనకు తోడుగా ఉంటూ, అటు తరువాత చంద్రబాబు చేసిన అలుపెరుగని పోరాటానికి బాసటగా నిలిచి, మీడియా రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుని, అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్న పోరాట పటిమ గల బి ఆర్ నాయుడు పార్టీ కోసం పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు టీటీడీ చైర్మన్ గా నియమించారు.  

 చంద్రబాబు ఆశించిన స్థాయి కంటే మించి బిఆర్ నాయుడు టీటీడీలోని అనేక లోటుపాట్లను సవరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా గత ఐదేళ్ల వైసిపి పాలనలో టిటిడి చైర్మన్ గా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి చేసిన కుంభకోణాలను ఒక్కొక్కటిగా వెలికి తీసే సాహసానికి పూనుకున్నారు. కమిషన్ల కోసం అభివృద్ధి పనుల పేరుతో మొదలు పెట్టిన 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులు బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. అందులో భాగంగానే అతిపెద్ద కుంభకోణం కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసింది. ఇలా అనేక వైసిపి పాల్పడిన అవకతవకలను కుంభకోణాలను బయటపెడుతున్న బిఆర్ నాయుడు పై తొలినుంచి ఆత్మ రక్షణలో పడిన భూమన కరుణాకర్ రెడ్డి ఎదురు దాడి మొదలుపెట్టారు. గోమాతను చనిపోతున్నాయి అంటూ మొదలుపెట్టి, అంచలంచెలుగా బి ఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ అనేక రాజకీయ కుట్రలకు తెర తీశారు. ఏఐ విధానంలో వీడియోలు మార్ఫింగ్ చేసి వ్యక్తిగత హననకు పాల్పడ్డారు. 

 భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై నిరంతరం బురద చల్లుతూ ప్రభుత్వాన్ని ఒకరకంగా ఇరుకున్న పెడుతున్నప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు లేకుండా చంద్రబాబు నోరు మెదపకపోవడంపై పార్టీ శ్రేణుల్లోనే అనేక అనుమానాలు రేకెత్తించాయి.  

 చంద్రబాబు వహించిన ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ముక్కలు ముక్కలుగా విడిపోయి నాలుగు స్తంభాలాటగా మిగిలింది. దీనికి తోడు అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించడంతో గెలిచిన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పార్టీ శ్రేణులనే కాదు అసలు ప్రజలను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి ఎమ్మెల్యే ఈనాటికీ భూమన కరుణాకర రెడ్డే అని తిరుపతి ప్రజలు అనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 శనివారం నాటి సంఘటన ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు యొక్క చేతకాని రాజకీయం పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది.

 నాలుగు రోజులు ముందు నుంచి తిరుపతి గంగమ్మ ఆలయం వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు పేరిట బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ.. లేదా ప్రభుత్వమే ఆయన తొలగించాలంటూ కార్యక్రమానికి సంకల్పించారు.

 అయితే ఇది ముందుగానే పసిగట్టిన టిడిపి శ్రేణులు వారికి వ్యతిరేకంగా తాము కూడా వైసిపి అవినీతి అక్రమాల నుంచి టీటీడీని కాపాడాలంటూ తాము కూడా గంగమ్మ ఆయంలో ప్రత్యేక పూజలు చేస్తామని ప్రకటించారు. తిరునక్షత్రాల రక్షణ ప్రతినిధులు తాము కూడా వైసీపీకి వ్యతిరేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ముందుకు వచ్చారు. జె బి శ్రీనివాస్ వర్గం మరో అడుగు ముందుకేసి గంగమ్మ ఆలయం వద్ద వైసీపీ రాజకీయ కార్యక్రమాలను అడ్డుకుంటామని ప్రకటించింది. 

 ఇదేదో పరిస్థితి ఉద్రిక్తంగా మారి గంగమ్మ ఆలయం వద్ద పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన తిరుపతి పోలీసులు 30 యాక్ట్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికీ ప్రత్యేక పూజలు చేసేందుకు అనుమతి లేదని, ఇలాంటి రాజకీయ పూజలకు గంగమ్మ ఆలయంలో అనుమతి ఉండదని, ఎలాంటి ప్లకార్డులను ప్రదర్శించరాదని ఆంక్షలు విధించారు. అయితే ఎవరెన్ని చెప్పినా పట్టించుకోకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడైన అభినయ్ రెడ్డి తన మంది మార్బలంతో అనుకున్న సమయానికి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అంతేకాదు ఆలయంలో వెళ్లి తాము అనుకున్న విధంగా బిఆర్ నాయుడు నీ టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ప్రార్థిస్తూ గంగమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు తరువాత అమ్మవారి ఆలయం నుండి తుడా కార్యాలయం సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ప్లకార్డుల ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. వందలాదిమంది జనంతో వైసిపి నాయకులు ఒకరకంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 

 గంగమ్మ ఆలయ పరిసరాల్లో 30 యాక్ట్ విధించిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. 

 పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై కేసులు పెడతామని అరెస్టులు చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన పోలీసులు అంతా ఉత్తుత్తిదేనని తేలిపోయారు. 

 30 మంది పోలీసులు బందోబస్తుగా గంగమ్మ ఆలయం వద్ద విధులు నిర్వర్తించగా వైసిపి నాయకులను ఏమాత్రం నొప్పి తగలకుండా కాపాడిన పోలీసులు ఈ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను మాత్రం అడుగడుగునా అడ్డుకున్నారు. ఆడ లేక మద్దెల ఓడు అన్న చందంగా విలేకరులపై విరుచుకుపడ్డారు. 

 ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరి నుంచి ఏ ఆదేశాలు వచ్చాయో.. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు కానీ... అడ్డుకుంటామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ వర్గాలు ఒక్కరు కూడా అటువైపు కనిపించలేదు. ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా తీసిన మీడియా వర్గాలకు ఆశ్చర్యం కలిగించేలా స్వయంగా జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యప్రసాద్ ఆదేశాల మేరకే టిడిపి శ్రేణులంతా అటువైపు కనిపించకుండా పత్తా లేకుండా పోయారని విశ్వసనీయమైన సమాచారం అందింది. 

 వాస్తవంగా జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యప్రసాద్ ముఖ్యమంత్రి సూచనల మేరకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా...? టిడిపి నాయకులను కార్యకర్తలను ఎందుకు ఇలాంటి అడ్డుకునే కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు??? లేక చంద్రబాబు మరి ఏదైనా దాగుడుమూతల రాజకీయం ఆడుతున్నారా..? లేక వైసిపి కట్టడికి మరేదైనా లోపాయికారి ప్రణాళికను అమలు చేస్తున్నారా.? ఏమో కానీ తిరుపతిలో చేజేతులారా తెలుగుదేశం పార్టీ వినాశనానికి చంద్రబాబు స్వయంకృతాపరాధానికి పూనుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటికే నాలుగు ముక్కలుగా తయారైన తిరుపతి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేస్తున్న నిర్లక్ష్యంతో పూర్తిగా కనుమరుగే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టాలు పడిన కార్యకర్తలను కూడా కాపాడుకోలేని చంద్రబాబు వైఖరి పట్ల తీవ్రంగా మదన పడుతున్నారు. ఇలాగే ఉంటే టిడిపిలో సాధారణ కార్యకర్తలే కాకుండా కీలకమైన నాయకులూ కూడా పార్టీని వీడి వెళ్లే ప్రమాదం ఉంది.