యుద్ధం ఆపాలి ప్రపంచశాంతి వర్ధిల్లాలి ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ క్యాండిల్ ప్రదర్శన ప్రదర్శన
యుద్ధం ఆపాలి... ప్రపంచ శాంతి వర్ధిల్లాలి..
మున్సిపల్ ప్రకాశం పార్క్ వాకర్స్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ప్రదర్శన
తిరుపతి మార్చ్ 22: మాయావి న్యూస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన యొక్క మొండితనంతో ఇతర దేశాల మీద ఆధిపత్యం చలాయించాలని భావిస్తూ అరబ్ దేశాల మీద యుద్ధం చేయడాన్ని ఖండిస్తూ వెంటనే యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం క్యాండిల్స్ ప్రదర్శన జరిగింది. పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో పాల్గొన్న వక్తలు వెంకట్ రెడ్డి, కోలా లక్ష్మీపతి, కేశవులు, గురునాథం, కొత్తపల్లి మునిరత్నం, వెంకట ముని, భక్తవత్సలం, రాజేశ్వరి, జగన్నాథం, సోనీ వెంకటేశ్వర్లు, తదితరులు మాట్లాడుతూ,
గల్ఫ్ దేశాల మీద జరుగుతున్న యుద్ధం కారణంగా అన్ని దేశాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఈ ప్రభావం భారతదేశంలో అధికంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ తో సహా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయని దీని కారణంగా ఆర్థికంగా పతనం కూడా జరుగుతుందని మానవాళి మనుగడకు ప్రపంచ శాంతి ఎంతో అవసరం అవుతుందని ఈ దిశగా అన్ని దేశాలతో పాటు మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ కూడా చర్యలు తీసుకోవాలని అభిలాషించారు. "యుద్ధం వద్దు.. ప్రపంచ శాంతి ముద్దు" అంటూ నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం రెండు మాసాల వరకు సరిపడా నిల్వలు గ్యాస్ పెట్రోలు డీజిల్ భారత దేశంలో ఉన్నాయని ఒకవైపు ప్రకటనలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కొరత లేదని ప్రతి ఒక్కరికి గ్యాస్ అందజేసే బాధ్యత తీసుకుంటామని గ్యాస్ కొరత సృష్టించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన నెల రోజులు దాటినప్పటికీ ఇళ్లకు సిలిండర్ రావడం లేదన్నారు. గ్యాస్ కొరతతో అనేక హోటల్లు మూతపడ్డాయి అన్నారు. సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీలను కానీ గ్యాస్ బాయ్ లను కానీ సంప్రదిస్తే కనీసం సమాధానం చెప్పే దిక్కులేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి పోవాలి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఆ దిశగా అన్ని దేశాలు చొరవ చూపాలని అందరూ విజ్ఞప్తి చేశారు.