శ్రీవాణి ట్రస్ట్ మార్గదర్శకాలలో మార్పులు... టీటీడీ ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి... తిరుమలలో నేడు టిటిడి పాలకమండలి సమావేశం.. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పై హైదరాబాద్ భక్తుల ఫిర్యాదు

శ్రీవాణి ట్రస్ట్ మార్గదర్శకాలలో మార్పులు... టీటీడీ ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి... తిరుమలలో నేడు టిటిడి పాలకమండలి సమావేశం.. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పై హైదరాబాద్ భక్తుల ఫిర్యాదు

ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధుల మార్గదర్శకాలలో మార్పులు 

టిటిడి ఉద్యోగస్తుల సంక్షేమంపై పాలకమండలి ప్రత్యేక దృష్టి 

స్వామివారి వాహన సేవల కోసం నూతన రాతి మండపం నిర్మాణం

 టిటిడి ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు 

తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

 తిరుమల మే 5 మాయావి న్యూస్: ✍️

 శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేకూరిన నిధులతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆలయాల కోసం ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను సడలించి, మరికొంత అదనంగా అంటే పది లక్షలు ఇస్తున్న ఆలయాలకు 15 లక్షలు, 15 లక్షలు ఇస్తున్న ఆలయాలకు 25 లక్షలు, గ్రేడ్ల వారీగా నిధులు పెంచి ఇవ్వాలని టిటిడి పాలకమండలి భావిస్తోంది. కొత్తగా నిర్మించనున్న దేవాలయాలకు అనుసరిస్తున్న నిబంధనలో కొన్ని మార్గదర్శకాలు మార్పు చేపట్టాలని టిటిడి భావిస్తోంది. 

 అలాగే కొంతకాలంగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీవాణి టిక్కెట్ల ను పొందే క్రమంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి, భక్తులకు మరింత సౌలభ్యంగా శ్రీవాణి టికెట్లను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి బోర్డు నేడు చర్చించనుంది. 

చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానున్న సమావేశంలో కొన్ని కీలక అంశాలను అజెండాగా చేర్చారు. ముఖ్యంగా

వేసవి సెలవుల్లో సామాన్యభక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. 

 తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పాలకమండలి వారికి అన్ని విధాల అండగా ఉండాలని భావించి, కొన్ని ప్రయోజనకరమైన నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిటిడి ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికీ ఉద్యోగులు తమ ఆరోగ్య పరిస్థితుల్లో వివిధ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న అనంతరం టీటీడీకి సమర్పించిన వైద్య ఖర్చు బిల్లులు రెండున్నర కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్నట్లు ఈ నిధులను వీలైనంత త్వరగా వారికి చెల్లించేందుకు అంగీకారం తెలుపనుంది. 

టిటిడి ఉద్యోగులకు కేటాయించిన ఇంటి స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

పాదిరేడు ఆరణ్యంలో 3,737 మంది ఉద్యోగులకు, పల్లం, ఏంపెడు మండలంలో 1672 మంది ఉద్యోగులకు, అలాగే 3032 మంది సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు గృహ స్థలాలు కేటాయించగా, అక్కడ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాల ఏర్పాటు పనులను త్వరలో చేపట్టాలని కూడా టిటిడి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఇందుకోసం ప్రాథమికంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ విభాగం అంచనాలు రూపొందించింది. దీనిపై బోర్డు సభ్యులు చర్చించనున్నారు. 

 అలాగే తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడావీధులు, రహదారులు, కూడళ్లకు...శ్రీవారి భక్తాగ్రేసరుల పేర్లు పెట్టాలని అధికారులు చేసిన ప్రతిపాదనలపై చర్చిస్తారు. 

 తిరుమలలో కూల్చివేసిన ప్రాచీన కట్టడాల పునర్నిర్మాణాన్ని ట్రస్ట్ బోర్డు చేపట్టబోతోంది. ప్రధాన ఆలయం ముందున్న రాతి రథ మండపం పునర్నిర్మాణం వంటి పాత నిర్ణయాలను ట్రస్ట్ బోర్డు పునరాలోచిస్తోంది. 

ప్రాచీన సంప్రదాయాన్ని పరిరక్షించడం, కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు, చారిత్రాత్మక రాతి మండపాలతో సహా ప్రాచీన కట్టడాల పునర్నిర్మాణానికి పూనుకుంటోంది. 'రథ మండపం'గా ప్రసిద్ధి చెందిన వాహన మండపం పేరుతో ఉన్న రాతి మండపాన్ని తొలగించి, ప్రతి రాయిపై ఒక సంఖ్యను గుర్తించి పక్కన భద్రపరిచారు. ఇప్పుడు రథ మండపాన్ని పునఃస్థాపించేందుకు శంకుస్థాపన చేయడానికి శుభ ముహూర్తం కోసం బుధవారం ట్రస్ట్ బోర్డు సమావేశం చర్చలు జరపనుంది. 

అలిపిరిలోని 16వ శతాబ్దపు పడాల మండపం పునరుద్ధరణ పనులను టీటీడీ ప్రారంభించింది. జనవరి 2026లో డాక్యుమెంటేషన్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, అసలైన నిర్మాణ సామగ్రి చారిత్రక సౌందర్యాన్ని పరిరక్షించే శాస్త్రీయ పునరుద్ధరణపై దృష్టి సారించింది. 

 అలాగే ముఖ్యమంత్రి కలలకు ప్రతిరూపమైన 

 తిరుపతిలోని అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ 'సమగ్ర టౌన్‌షిప్'కు శంకుస్థాపన చేసే తేదీని కూడా బోర్డు చర్చించడం ఈ మేరకు ఒక ప్రణాళికను ఆమోదించడం జరుగుతుందని టిటిడి వర్గాలు తెలిపాయి. 

👉 టీటీడీ గోశాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపండి...

👉 టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి అవినీతిపరులతో చేతులు కలుపుతున్నారు?

👉 టిటిడి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన హైదరాబాద్ కు చెందిన దాతలు 

 తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర డైరీ ఫార్మ్ గోశాల పనితీరు ఏమీ బాగా లేదని గతంలో జరిగిన గోవుల మరణాలు, వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకొని మరింత చక్కగా నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని హైదరాబాదుకు చెందిన యానిమల్ బోర్డ్ సభ్యులు ఇద్దరు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. గోవులకు వేయాల్సిన దాణా గడ్డి సకాలంలో వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తాము ఎన్నోసార్లు గోసాల కు కావలసిన సామాగ్రిని విరాళంగా అందించామని, అయితే గో సంరక్షణ శాలకు సంబంధించిన టిటిడి బోర్డు సభ్యుల కమిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు. అంతకు మునుపు ఇక్కడ సమస్యలపై ఎన్నో ప్రశ్నలు వేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఇప్పుడు అవినీతి పరులతో చేతులు కలిపి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. గోసాల అధికారులు కూడా దేనికి సంబంధించిన వివరాలను ఏది అడిగినా... తెలియదంటున్నారని అలాంటి అధికారులను బదిలీ చేయాలని సూచించారు. 

 వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లని నేటికీ కొనసాగిస్తున్నారని ఫలితంగా గోశాల పనితీరు అద్వాన్నంగా తయారయ్యిందని టెండర్ల విధానంలో మార్పులు చేపట్టాలని అవసరమైతే కాంట్రాక్టు కార్మికుల కాంట్రాక్టర్లను మార్చాలని ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలిసి విన్నవించామని చెప్పారు. చంద్రబాబు చేసిన సూచనల మేరకే టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ను కలవడం జరిగిందని, ఈమేరకు ముఖ్యమంత్రి అందించిన వినతిపత్రం కూడా టిటిడి చైర్మన్ కు అందజేశారు. దీనిపై టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు వారికి హామీ ఇస్తూ అన్ని పరిస్థితులను చక్కదిద్దుతామని, సమర్థవంతంగా నిర్వహించి, గోసాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని వారికి హామీ ఇచ్చారు.