శ్రీవారి రథానికి రాతితో నూతన మండపం... టీటీడీ ఉద్యోగులకు చైర్మన్ బిఆర్ నాయుడు వరాల జల్లులు
శ్రీవారి రథానికి రాతితో నూతన మండపం నిర్మాణం
👉 44 కోట్ల రూపాయలతో పట్టు వస్త్రాల కొనుగోళ్ళు
👉తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక పేర్లు
👉 టిటిడి విద్యా సంస్థల అభివృద్ధికి 118 కోట్లతో అదనంగా మరో 43.40 కోట్లు నిధులు కేటాయింపు.
👉 250 కోట్లతో టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద మౌలిక వసతులు
👉 ఉద్యోగులకు వైద్య ఖర్చులకోసం 13 కోట్ల రీయంబర్స్మెంట్ చెల్లింపు, 25 కోట్ల తో ఉద్యోగుల వైద్యం కోసం మూల నిధి కేటాయింపు
👉 అలిపిరి ప్రాంతంలో భక్తులకు సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నెలలోపు శంకుస్థాపన
👉 ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంపు
👉 - త్వరలో "అక్షర గోవిందం"
👉 అలిపిరి వద్ద 4.7 కోట్లతో శాశ్వత యాగశాల
ఉద్యోగులకు వరాల జల్లు కురిపించిన : టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
తిరుమల, మే 6, మాయావి ప్రతినిధి :✍️
తిరుమల కొండపై పురాతన వైభవం ఉట్టిపడేలా శ్రీవారి రధానికి రాతి తో కూడిన మండపాన్ని చారిత్రాత్మక వైభవానికి చిహ్నంగా నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల కొండపై పరిమితంగా ఉన్న వసతి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోనే అలిపిరి ప్రాంతంలో సకల సౌకర్యాలను భక్తులకు కల్పించేలా దాదాపు 25 వేల మంది భక్తులకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టిటిడి పాలకమండలి ప్రణాళిక రూపొందించింది. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ భారీ నిర్మాణానికి నెల రోజుల్లోపుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. అలిపిరి ప్రాంతంలో టిటిడి కి ఉన్న 30 ఎకరాల స్థలంలో ఆరు ఎకరాలు శిల్పకళాక్షేత్రానికి యధాతధంగా వదిలిపెట్టి మిగిలిన 24 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపడుతారు. ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ లో శ్రీవారి భక్తులకు కావలసిన సకల సదుపాయాలను అందుబాటులో ఉంచుతారు. ఇక్కడి నుండి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరే అవకాశం భక్తులకు ఉంటుంది.
అలాగే చాలా కాలానికి టిటిడి ఉద్యోగులపై పాలకమండలి చైర్మన్ బి.ఆర్ నాయుడు వరాల జల్లు కురిపించారు. అడుగకనే వరమిచ్చినట్లు టిటిడి ఉద్యోగులకు వైద్య ఖర్చులకు ఇస్తున్న మూడు లక్షల నిధులను ఐదు లక్షలకు పెంచారు.
అలాగే గత ఐదేళ్ల వైసిపి పాలన నుండి ఉద్యోగులకు ఎటువంటి వైద్య ఖర్చులు చెల్లించకుండా పెండింగ్ ఉండిపోయిన 13 కోట్ల రూపాయలను రియంబర్స్మెంట్ కింద వెంటనే చెల్లించేందుకు పాలకమండలి తీర్మానించింది. ఉద్యోగులకు ఏటా కేటాయించే వైద్య నిధి కింద అదనంగా 25 కోట్ల రూపాయలను కేటాయించేందుకు నిర్ణయించారు.
అంతేకాకుండా టిటిడి ఉద్యోగులకు ఇటీవల కేటాయించిన ఇంటి స్థలాలు వాటి అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు విద్యుత్ సరఫరా కాలువల నిర్మాణం రోడ్ల విస్తరణ తదితర వాటి కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులతో టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలను అభివృద్ధి చేసేందుకు పాలకమండలి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీ ఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో మరికొన్ని ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
1. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాట గంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూలైన్లలో రూ.4.55 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదం.
2. తిరుమలలోని నాలుగు మాడ వీధులు, రోడ్లు, సర్కిళ్లకు కమిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశస్థ్యం కలిగిన 51 పేర్లను పెట్టేందుకు ఆమోదం.
3. టిటిడి బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలలో అత్యాధునిక మౌళిక వసతుల ఏర్పాటుకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇప్పటికే గత బోర్డు సమావేశంలో రూ.118 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మొత్తం కలిపి రూ.161.40 కోట్లు కేటాయించాం.
4. తిరుమలలో నీటి వృధాను అరికట్టేందుకు, రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోగర్భం డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు రూ.6 కోట్లతో దాదాపు 2 కిలో మీటర్ల మేర అదనపు పైపులైన్ ఏర్పాటుకు ఆమోదం.
5. టీటీడీ అవసరాల నిమిత్తం రూ. 44.20 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థల నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితరాలు కొనుగోలు చేసేందుకు ఆమోదం.
6. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం.
7. సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన "అక్షర గోవిందం" కార్యక్రమంలో పాల్గొనే చిన్న పిల్లలకు పంపిణీ చేసే కిట్‌ను ఉచితంగా అందించేందుకు నిర్ణయం.
8. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా, పెరూర్ తాలూకాలోని శెట్టిపాళ్యం గ్రామంలో జీస్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు టీటీడీకి రిజిష్ట్రర్ చేసి ఇచ్చిన 19.43 ఎకరాల స్థలాన్ని టీటీడీలో విలీనం చేసుకోవడానికి ఆమోదం.
9. మహారాష్ట్రలోని నవీ ముంబైలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో త్వరలో మహా సంప్రోక్షణ జరుగనున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి ప్రభుత్వ అనుమతికై నివేదించాలని నిర్ణయం.
10. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును టీటీడీ బోర్డు సభ్యులు సౌరబ్ బోరా భరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
11. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం - 1లో రూ. 3.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం.
12. తిరుపతిలోని అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించేందుకు నిర్ణయం.
13. పద్మశ్రీ అవార్డు గ్రహిత డా.శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమించేందుకు నిర్ణయం.
14. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలో ఉన్న అనంతవరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ.2.71 కోట్లతో రాజ గోపురం నిర్మాణానికి ఆమోదం.
15. రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ.36.95 కోట్లతో ఏడు అంతస్తుల మహా రాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్ధాల మండపం, వాహన మండపం, రథ మండపం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి నిర్మాణానికి ఆమోదం.
16. ప్రస్తుతం తిరుమలలో కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. పాలనా సౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలను ఒకే చోటు తీసుకొచ్చేందుకు నూతనంగా పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయం.
17. సత్యసాయి జిల్లా లేపాక్షిలో నూతన కల్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం.
18. దాతల ప్రివిలేజెస్ కు సంబంధించిన విధి విధానాల ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సభ్యులతో కమిటి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.
19. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని ఆలయం నిర్మించేందుకు ఆమోదం.
20. టీటీడీలో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డు జారీ చేయాలని నిర్ణయం.
21. టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ లో భాగంగా ఇప్పుడిస్తున్న రూ.3 లక్షలకు అదనంగా మరో రూ.2 లక్షలను కలుపుతూ 5 లక్షల వరకు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆమోదం. అలాగే ఇప్పటివరకు ఉద్యోగులకు రీయంబర్స్మెంట్ పేరిట ఉన్న 13 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్.
22. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయకస్వామి ఆలయ సమీపంలో రూ.4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
23. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5000/- నుండి రూ.10,000/- కు పెంచేందుకు నిర్ణయం.
24. శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణయం.
ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.