సప్త వర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

సప్త వర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

పూల సుగంధాలతో అలరించిన శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం

 తిరుమల, మాయావి న్యూస్ 

      శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.

         ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

       మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.  

        ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  వరలక్ష్మి, గార్డెన్ సూప‌రింటెండెంట్  శ్రీ‌నివాసులు, గార్డెన్ మేనేజర్  జనార్దన్ రెడ్డి, సూపరింటెండెంట్  రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు  బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు  మునికుమార్‌,  ధ‌న‌శేఖ‌ర్‌ పాల్గొన్నారు.