తిరుమల నాదనీరాజనం వేదికపై స్వర సంగమం సాంస్కృతిక కార్యక్రమాలు
ఉగాది సందర్భంగా తిరుమలలో “స్వర సంగమం”
భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి
తిరుమల మార్చు 19 మాయావి న్యూస్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీరజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది.
“స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం ఉగాది శుభసందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక సంగీతానుభూతిని అందించింది. శాస్త్రీయ సంగీతం, పాప్ మరియు ఫ్యూజన్ రంగాల్లో తన ప్రత్యేక శైలితో ఖ్యాతి పొందిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి తమ డ్రమ్స్ వాయిద్యంతో భక్తులను మైమరపించారు. పద్మశ్రీ డా. శంకర్ మహదేవన్ తన సుమధుర గాత్రంతో భక్తి గీతాలను ఆలపించి సంగీత ప్రియులను మైమరపించారు.
శివమణి వాయిద్య రాగాలు శంకర్ మహదేవన్ గారి మధుర స్వర విన్యాసం కలసి తిరుమల అంతటా మారుమ్రోగుతూ భక్తులకు ఒక అపూర్వ సంగీతానుభూతిని అందించాయి. ఈ అద్భుత సంగీత సమ్మేళనం సంగీతాభిమానులకు శ్రవణానందాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వాద్యకారులు బి.వి. బాలసాయి (ఫ్లూట్), రాజేష్ (మాండలిన్), ఎంబర్ కణ్నన్ (వయోలిన్), ప్రవీణ్ నారాయణన్ (తబల), శాశ్విన్ ఆళ్వార్ (కీబోర్డు) తమ ప్రతిభను ప్రదర్శించారు.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కళాకారులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఎస్వీబీసీ ఇన్చార్జ్ సీఈఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.