తిరుమల
తిరుమల హోటల్స్ టెండర్లు, డిప్ విధానంపై ఆధారాలు సమర్పించండి..!
కేటాయింపుదారుల అర్హత ను ఏ విధంగా నిర్ణయించారు..?
టీటీడీ రెవెన్యూ పంచాయతీకి హైకోర్టు అక్షింతలు
తిరుమల జనవరి 21, మాయావి న్యూస్
తిరుమలలో టీటీడీ ఆధీనంలో ఉన్న పెద్ద హోటల్స్, జనతా క్యాంటీన్ల కు గత ఏడాది జూన్లో నిర్వహించిన టెండర్లు డిప్ విధానంలో పాటించిన కేటాయింపులు వాటికి అనుసరించిన విధానం, తదితర అంశాలపై కేటాయింపుదారుల అర్హతపై పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్లు, వివరాలు అందజేయాల్సిందిగా హైకోర్టు టిటిడిని ఆదేశించింది.
ఈ హోటల్స్ కు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, ఎటువంటి అవకతవకలకు తావు కల్పించలేదని, హోటల్స్ కేటాయింపులో పాటించిన డిప్ పద్ధతి న్యాయబద్ధంగా జరిగిందని, టిటిడి వైపు నుంచి మౌఖికంగా చెబితే సరిపోతున్నారు. ఆ విధంగా పాటించినట్లు నిరూపించే ఆధారాలను న్యాయస్థానానికి అందజేయాలని న్యాయమూర్తి టిటిడిని ఆదేశించారు. గత ఏడాది జూన్ మాసంలో తిరుమల కొండపై ఉన్న 5 బిగ్ క్యాంటీన్లు, 5 జనతా క్యాంటీన్లు కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ సక్రమమైన పద్ధతిలో జరగలేదని, టీటీడీ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ కేటాయింపులు జరిపారని ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. Wp/21793/2025 కేసు పై ఈనెల 20న మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. బిగ్ క్యాంటీన్లు జనతా క్యాంటీన్లు కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ లో అవకతవకలు జరిగాయని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ కారణంగా టిటిడి జరిపిన టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని వ్యాపారులకు కేటాయించిన హోటల్ లను డిప్ పద్ధతిలో చేసిన విధానాన్ని పునః పరిశీలించి తిరిగి టెండర్ల ప్రక్రియను నూతనంగా నిర్వహించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై టిటిడి తరఫున వాదించిన న్యాయవాదులు టెండర్ల ప్రక్రియలో అంతా నిబంధనలు ప్రకారమే వ్యవహరించామని, ఇప్పటికే ఈ క్యాంటీన్లను సంబంధిత టెండర్ దారులకు అప్పగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశామని, హైకోర్టుకు విన్నవించారు. అయితే హైకోర్టు సీరియస్ గా స్పందిస్తూ... టిటిడి అనుసరించిన విధానాన్ని సరికాదంటూ అక్షింతలు వేసింది. ఈ అంశాలను మౌఖికంగా చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నించింది. ఆఫిడవిట్ లో ఈ వివరాలు పొందుపరచడంతో పాటు టెండర్లలో అర్హత పొందిన వారి వివరాలు పూర్తి ఆధారాలను న్యాయస్థానానికి సబ్మిట్ చేయాల్సిందిగా ఫిబ్రవరి మూడో తేదీకి ఈ కేసును వాయిదా వేసింది.
🌱 రెండింటికి చెడ్డ రేవడిలా హోటల్స్ వ్యవహారం. 🌱 కోట్లాది రూపాయలు టీటీడీకి నష్టం.
తిరుమల కొండపై ఉన్న దాదాపు 17 హోటల్స్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ కేటాయింపుల్లో పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తున్నామంటూ టిటిడి అనుసరించిన కొత్త విధానంతో సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఏర్పడింది. మరోవైపు భక్తులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనాన్ని ఆహార పదార్థాలను అందించాలని టిటిడి తీసుకున్న కొత్త నిర్ణయం అమలు చేయలేకపోగా మరోవైపు ఆర్థికంగా కూడా టీటీడీకి వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకున్నట్లయింది.
ఈ కేసు న్యాయస్థానంలో గత ఎనిమిది నెలలుగా నడుస్తున్నందున కొండపై హోటల్స్ కూడా మూతపడ్డాయి. టిటిడి ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ వాటిని నిర్వహించుకోవాలా లేదా మూసివేయాలా అర్థం కాకుండా ఎనిమిది నెలలుగా హోటల్స్ అన్ని రెనోవేషన్స్ పేరుతో మూసివేసి యాత్రికులకు అందుబాటులో లేకుండా పోయాయి.
కొండపై ఉన్న 10 బిగ్ క్యాంటీన్లు, 7 జనతా క్యాంటీన్లు పై మాసానికి సరాసరిగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల అద్దెల రూపంలో ఆదాయం టిటిడి కి సమకూరుతుండేది.
అయితే దీన్ని పునసమీక్షిస్తూ గత ఏడాది టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకు రెండు క్యాంటీన్లను ఏపీ టూరిజం సంస్థకు నామమాత్రపు అద్దెపై అప్పగించింది. అంతకు క్రితం వరకు ఈ రెండు హోటళ్లకు కలిపి మాసానికి 80 లక్షల రూపాయలకు పైగా అద్దె వస్తుండగా.. ఏపీ టూరిజం సంస్థకు కేవలం 10 లక్షల రూపాయలకు అద్దె చెల్లించేలా నామమాత్రపు ధరకు టీటీడీ ఈ రెండు హోటల్ లను అప్పగించింది.
కానీ ప్రస్తుతం ఈ హోటల్స్ లో టీటీడీ ఆశించిన విధంగా భక్తులకు సరసమైన ధరలకు ఆహారం లభించడం లేదు. పక్కా వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తూ తినుబండారాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ విధంగా టీటీడీ లక్ష్యం కూడా నెరవేరకుండా పోయింది. మరోవైపు మిగిలిన క్యాంటీన్ల వ్యవహార శైలిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. సన్నిధానం వద్ద ఉన్న ఒక హోటల్ టీటీడీకి మూడు కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పడితే వాటిని టిటిడి బోర్డు మానవతా దృక్పథంతో వ్యవహరించి వ్యాపారికి నష్టం లేకుండా సుమారు రెండు కోట్ల రూపాయల అద్దెలను టీటీడీకి చెల్లించే అవసరం లేకుండా రద్దు చేసింది. ఇలా తమకు కూడా రద్దు చేయాలంటూ మిగిలిన హోటల్ కూడా టీటీడీ కోరే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి.
తిరుమల రామ్ బగీచా వద్ద ఉన్న మరో హోటల్ కు సంబంధించి న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ హోటల్ ను నిర్వహిస్తున్న నిర్వాహకుడు మాసానికి 40 లక్షల రూపాయలు టీటీడీకి అద్దె చెల్లిస్తామంటూ ముందుకు వస్తున్నప్పటికీ టిటిడి అందుకు విరుద్ధంగా టెండర్ నిబంధనలు ప్రకారం మూడేళ్లు ముగిసిన తర్వాత ఖాళీ చేయించాలని ప్రయత్నించింది. ప్రయత్నంలో భాగంగా టెండర్ నిర్వహించి, నామమాత్రపు ధరలకు మరొకరికి కట్టబెట్టాలని చూడడంతో, హోటల్ నిర్వాహకుడు దీనిపై తాను ఇప్పటికే రెన్యూవేషన్ చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఎంతో నష్టపోయానని, కాబట్టి తనకే తిరిగి లైసెన్సులు రెన్యువల్ చేయాలని, ఈ విధంగా టిటిడిని ఆదేశించాలని న్యాయస్థానం ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుపై స్టేటస్ కో నడుస్తోంది.
తిరుమల హోటల్స్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఆ రాజకీయ జోక్యం ఎక్కువ కావడం, టిటిడి అధికారులపై సిఫార్సుల ఒత్తిడి అధికమవడం కారణంగా టిటిడి లక్ష్యం ఉన్నతమైనప్పటికీ శ్రీవారి భక్తులకు అనుకున్న స్థాయిలో సరసమైన ధరలకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు వీలు కాకుండా పోయింది. నిబంధనలు పక్కనపెట్టి భక్తుల ప్రయోజనార్థం కిందిస్థాయిలో వాస్తవాన్ని గుర్తించి టిటిడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించాలని భక్తులు కోరుకుంటున్నారు.