లడ్డూలకే కాదు శ్రీవారి గర్భాలయంలో దీపాలకు కల్తీ నెయ్యి
చర్యలు తీసుకోకుండా నాటకాలు ఆడుతున్న కూటమి ప్రభుత్వం
💥*లడ్డూలకే కాదు.. గర్బాలయంలో దీపానికి.. స్వామివారి నైవేద్యం ప్రసాదాలకూ కల్తీ నెయ్యే.!?*💥
👉 *దొంగే..దొంగా దొంగా అన్నట్లుగా జగన్ దిగజారుడు*
👉*హిందూ ధర్మం పేరుతో చంద్రబాబు నాటకీయం*
👉 *సనాతన ధర్మం పేరుతో పవన్ ప్రాయశ్చిత్తం*
👉*కల్తీ నెయ్యి పేరుతో కొండ చుట్టూ ఏపీ రాజకీయం*
👉*వివాదాస్పద రాజకీయాలకు వేదికగా టీటీడీ*
👉*ఏది సత్యం, ఏది అసత్యం.. ఏడుకొండలవాడా.!*
🏹 *కోలా లక్ష్మీపతి / ఎడిటర్ / మాయావి న్యూస్* ✍️
--------------~~~~~~~~~~~~----------------
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కల్తీ నెయ్యి చుట్టూ సాలెగూడులా అల్లుకుంది. 2019- 2024 ఏడాదిల మధ్య వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడడమే కాకుండా పవిత్రమైన తిరుమల కొండను కూడా కల్తీమయం చేసేసింది. దేవుడి హుండీలో హిందువులు వేసిన 250 కోట్ల రూపాయల కానుకలను కల్తీ నెయ్యి పేరుతో అవి అవినీతి కడుపులోకి దిగమింగి కరిగించేశారు.*
*నిజంగా హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీపై మతపరమైన కుట్ర జరిగిందా లేదా అనే అంశం పక్కన పెడితే... 100 కోట్ల మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పై గతంలో ఎన్నడూ లేనంత వివాదం చెలరేగింది. లడ్డు యొక్క చారిత్రాత్మకమైన ప్రాశస్త్యం దెబ్బతింది. అంతేకాదు ఏడుకొండల వాడి సన్నిధిలో ఏదైతే జరగకూడదు అని భావిస్తామో సరిగ్గా అలాంటి నీతిమాలిన రాజకీయాలే జరుగుతున్నాయి. కల్తీ నెయ్యి పై భక్తుల మనోభావాలు కంటే కూటమి ప్రభుత్వం, వైసిపి నాయకత్వం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో టీటీడీ పరువు ప్రతిష్ట సమిదలా ఆవిరవుతోంది.*
*టీటీడీ వాడుతున్నది కల్తీ నెయ్యి అని నిర్ధారణ నాలుగు లేబరేటరీలలో పరిశీలనల ద్వారా ఎప్పుడో తేలిపోయింది. ఇందులో అసలు ఆవు పాలే వాడకుండా ప్రమాదకరమైన రసాయనాల ద్వారా నెయ్యి తయారుచేసి టీటీడీకి భోలే బాబా లాంటి బడా దొంగలు అందించారన్నది స్పష్టం అయింది. ఈ పాపాలకు ఒడిగట్టింది అప్పటి వైసిపి పాలకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మెన్ లు గా పని చేసిన వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వారి అనుచరులే అన్నది కళ్ళు ఎదురుగా కనిపిస్తోంది. సిట్ కూడా ఇదే తేల్చింది.*
*అయితే దొంగతనం చేసిన వాడు కిమ్మనకుండా ఉండి ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు. నేను దొంగే అయితే చెడ్డ దొంగను కాదు.. చాలా మంచి దొంగను అని నిరూపించుకునేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మిత్ర ధ్వయం తెగ ఆరాటపడింది. సిట్ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని చెప్పింది కాబట్టి కల్తీ కి మాత్రమే పాల్పడ్డాము.. మేము చాలా మంచి వాళ్ళము అంటూ బహిరంగంగా జనం ఏమనుకుంటారో అనే సిగ్గు ఎగ్గు లేకుండా పనికిమాలిన వాదనలకు వైసీపీ నేతలు దిగడంతోనే అసలు సమస్య మొదలైంది. అంతకుముందే శ్రీవారి లడ్డూలకు వాడిన నెయ్యిలో అపవిత్రమైన జంతువు కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనాలోచితంగా మాట్లాడేసి వైసీపీని ఇరుకును పెట్టేందుకు ఓ రకంగా చెప్పాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేందుకు నిర్ణయించుకుని మాట్లాడేసారు.*
*సిట్ నివేదికను అడ్డం పెట్టుకొని వైసీపీ తన తప్పును తెలుసుకోకుండా అడ్డగోలు ప్రచారం మొదలుపెట్టడంతో ఇక తప్పదు అనుకుని చంద్రబాబు కూటమి నేతలు కూడా వైసిపి దుష్ప్రచారానికి కళ్ళెం వేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలను కూటమినేతలందరినీ ఏకం చేసి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో తెలిసేలా కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇదంతా ఒక ప్రణాళికలా వైయస్ జగన్మోహన్ రెడ్డిని హిందువు కాదు క్రిస్టియన్ అని నిరూపించేందుకు ఒక చట్రంలో బిగిస్తూ భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టేందుకు తిరుమల ఇష్యుని వాడుకోవడం ప్రారంభించారు.*
*ముఖ్యమంత్రి చంద్రబాబు నిజానికి తిరుపతి స్థానికుడిగా తిరుమల కొండను టిటిడి సంస్థను రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి కేవలం రాజకీయ ప్రయోజనం కోసం కల్తీ నెయ్యి వ్యవహారాన్ని, పరకామణి కుంభకోణాన్ని పట్టుకొని పరోక్షంగా టిటిడి పరువు తీస్తున్నారు.* *నిజమే కల్తీ నెయ్యి కేసులో తప్పు చేసిన వారికి శిక్ష వేయాలి అనే వాదనకు ఎవరూ వ్యతిరేకులు కారు. కానీ చంద్రబాబు కూటమినేతల ఆలోచనలు అలా కనిపించడంలేదు.* *హిందూధర్మాన్ని కాపాడాలి అనే ఏకైక లక్ష్యం తనకే ఉందంటూ చంద్రబాబు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అన్ని వైపులా ప్రచారం చేస్తున్నారు.*
*సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ప్రాయశ్చిత్తం దీక్ష పేరుతో పాదయాత్ర చేశారు.*
*బాగానే ఉంది కానీ కూటమి నేతలు చేస్తున్న ఈ విపరీతమైన ప్రచారం కారణంగా తిరుమల పవిత్రత దెబ్బతింటోందా లేదా..?* *లడ్డూలపై ఉన్న నమ్మకాన్ని భక్తులు కోల్పోతున్నారా.. లేక ఆవేదనతో ఇబ్బంది పడుతున్నారా లేదా..?* *శతాబ్దాల తరబడి స్వామి వారిపై ఉన్న నమ్మకం సడలుతోందా..? లడ్డు ప్రసాదాలలోనే కాకుండా స్వామివారి గర్భాలయంలో వెలిగిస్తున్న దీపాలకు, స్వామివారికి నైవేద్యం పెడుతున్న అన్న ప్రసాదాలలోనూ, భక్తులకు విక్రయిస్తున్న అన్ని రకాల ప్రసాదాలలోనూ ఇదే కల్తీ నెయ్యి వాడారనే వాస్తవాన్ని తలుచుకుంటేనే భక్తులే కాదు టిటిడిలోని పెద్దలు, అధికారులు, ఉద్యోగులు స్థానికులు, స్వామీజీలు అందరికి బాధతో గుండె బరువెక్కుతోంది. స్వామి వారికే ఇంతటి అపచారం జరిగిందా అంటూ బాధాతప్త హృదయాలతో.. క్షమించు స్వామి అంటూ ముకుళిత హస్తాలతో దేవుడికి దండం పెడుతున్నారు.* *అయితే
ఇలా ఆలోచిస్తున్న భక్తులకు సంబంధించి వారి మనోభావాలను కూటమి ప్రభుత్వంకానీ అటువైసిపి ప్రబుద్ధులుకానీ ఆలోచించడం లేదు.*
హిందూ ధర్మానికి వ్యతిరేకంగా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు అని ప్రమాదకరమైన అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి ఇదే విధమైన ప్రచారాన్ని ఇకపై వచ్చే ఎన్నికల వరకు వాడుకోవాలి అని రాజకీయపరమైన దృక్పథం కూటమినేతల్లో కనిపిస్తోంది. అందుకనే కల్తీ నెయ్యి కేసులో దోషులు కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న వారిని అరెస్టు చేయడం కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ జరగడం లేదు. వారంతా దొంగలు అని వైసిపి నేతలపై ప్రజల్లో వ్యతిరేక భావాన్ని నాటడం కోసమే సమయాన్ని అంతా వెచ్చిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాబు నియమించిన ఏకసభ్య కమిషన్ కూడా ఈ అంశాన్ని శంకు లో పోసిన విధంగా చూపించడానికే అనే అనుమానం కూడా ఉంది. వైసీపీకి రాజకీయంగా ఎంతో నష్టం కలిగించిన కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో దోషులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లాంటి పెద్దలను కటకటాల్లోకి నెట్టేందుకు కూటమి సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అలా కనుక వారిని అరెస్టు చేస్తే ప్రజల్లో వారిపై సానుభూతి పెరిగి రాజకీయంగా బలవంతులవుతారని కూటమి పెద్దలు యోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
` నిజానికి, తిరుపతి లడ్డూ విషయంలో సిబీఐ వేసి సిట్ నెల్లూరు ఎసీబీ కోర్టులో తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక సారాంశం మూడు నెలల క్రితమే ఢిల్లీకి చెందిన వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. జాతీయ ఆంగ్ల పత్రికలు ఢిల్లీ ఎడిషన్లలో ఆ వార్తను ప్రచురించాయి కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో మాత్రం ప్రచురించలేదు. ఇంగ్లీష్ వెబ్‌సైట్ ‘ప్రైమ్ పోస్ట్ ’ ఎడిటర్ రవీంద్ర శేషు ఆ వార్తను 2025 నవంబర్ 17వ తేదీన ప్రచురించారు. ఆ కథనం అత్యంత స్పష్టంగా సిట్ తేల్చిన అంశాలను వివరించింది.
ఈ రెండు సందర్భాలను ఎందుకు ఉదహరించాల్సి వచ్చిందంటే, మన తెలుగు మీడియా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తుందా, లేదా అనే విషయాన్ని చెప్పడానికే. సత్యం అనేది పెద్ద మాట కానీ తెలుగులోని ప్రధాన వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లు ఎందుకు ప్రజలకు వాస్తవం చెప్పే బాధ్యతను తీసుకోవడం లేదనేది ప్రధానమైన ప్రశ్న. సిట్ నివేదిక అంశాలను టీడీపికి వత్తాసు పలికే ప్రధానమైన వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లు ప్రచురించలేదు, ప్రసారం చేయలేదు. దాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ ‘ వైసిపి ’ మీడియా’కు ఏమైంది? తిరుపతి లడ్డూ తయారీకి బోలే బాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా సిట్ స్పష్టంగా చెప్పింది. కానీ, ఆ నెయ్యి రసాయనాలతో తయారు చేసిందని చెప్పింది. నెయ్యికి అసలు పాలనే వాడలేదని స్పష్టం చేసింది. బోలేబాబా డెయిరీ నుంచి వచ్చిన నేతి ట్యాంకర్లను టీటీడీ వెనక్కి పంపించింది. అయితే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బోలేబాబా డెయిరీ కాంట్రాక్టును రద్దు చేసి తిరుపతిలోని వైష్ణవీ డెయిరీకి అప్పగించారు. వైష్ణవీ డెయిరీ ఏ నెయ్యిని సరఫరా చేసిందో పరిశీలించారా? దీనిపై కూడా సిట్ స్పష్టత ఇచ్చింది.
సిట్ నివేదిక అంత స్పష్టంగా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయాలు ఎలా వున్నాయి? జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక తేల్చిన విషయం బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాలుకలు మడత పెడుతున్నారు. పరీక్షలు నిర్వహించిన సంస్థను చంద్రబాబు తప్పు పడుతున్నారు. ఆ ల్యాబ్ కనిపెట్టని విషయాన్ని కనిపెట్టడానికి ఓ కమిటీని వేయాలని నిర్ణయం తీసుకున్నారు. బహుశా, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పించడానికే ఆ కమిటీని ఏర్పాటు చేశారనే అనుమానాలు వ్యక్తం కావడం సహజం.
పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంలో ఆయనను మించిన నాయకుడు రాజకీయాల్లో లేరని ఇప్పటికే రుజువైంది. తిరుపతి లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మెడలో మాల వేసుకుని, కాషాయ దుస్తులు ధరించి, ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఇప్పుడేమంటున్నారు? తాను జంతువుల కొవ్వు కలిసిందని అనలేదని, నెయ్యి కల్తీ జరిగిందని భక్తులు ఫిర్యాదు చేయడం వల్లనే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానని అంటున్నారు. ఇంతటితోనే కథ అయిపోలేదు.
తిరుపతి లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మళ్లీ తెర తీశారు. వారికి వత్తాసు పలుకుతున్న మీడియా వంత పాడుతున్నది. తిరుపతి లడ్డు విషయం భక్తులకు సంబంధించిన అంశం కాకుండా పోయింది. అది అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆధిపత్యం కోసం చేసే రాజకీయ పోరాటంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పక్కన పెడుదాం. ఎందుకంటే, ఆయన హిందువు కాడు కాబట్టి తిరుపతి దేవస్థానాన్ని మకిలి చేయడానికి పూనుకున్నాడని చంద్రబాబు అంటున్నారు. పవిత్రమైన తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆడుతున్న రాజకీయ నాటకం మాట ఏమిటి? సనాతన ధర్మం, హిందూ ధర్మం పేర వారిద్దరు తిరుమలేశుడిని లాగుతున్నారంటే, వారిని భక్తులనుకోవాలా, నాస్తికులనుకోవాలా?
అదంతా ఒక ఎత్తయితే, ఇక్కడ కొన్ని మౌలిక ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వుంది. కల్తీ నెయ్యి సరఫరా అనేది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందా? అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ జరగలేదా? కల్తీ నెయ్యి సరఫరాకు బాధ్యులెవరు? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జరుగుతున్న లడ్డూలను అంత పెద్ద మొత్తంలో తయారు చేయాల్సిన అవసరం వుందా? అసలు అంత తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి అంత మొత్తంలో లభిస్తుందా?
కిలో నెయ్యి రూ.278కే గత చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఒక ఒప్పందం జరిగింది. జగన్ ప్రభుత్వ హయాంలో 319 రూపాయలకు ఒప్పందం కుదిరింది. స్వచ్ఛమైన నెయ్యి ఆ ధరకు లభించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. నువ్వుల నూనెనే రూ.400కు రావడం లేదని అంటూ నెయ్యి అంత తక్కువ ధరకు లభిస్తుందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలో నిజాయితీ, నిజం వుంది. అయితే, ఈ ప్రశ్న వేయాల్సింది జగన్ ప్రభుత్వ హయాంలోని ఒప్పందం గురించి మాత్రమే కాకుండా వరుస ఒప్పందాల గురించి కూడా ప్రశ్నించాల్సి వుంటుంది. దేశంలోని గోశాలల్లో, ఇతర పద్ధతుల్లో లభించే పాల ద్వారా వచ్చే నెయ్యి ఏ మాత్రం తిరుపతి లడ్డుల తయారీకి సరిపోదు. ఈ విషయాన్ని ఎందుకు టీటీడీ గానీ ప్రభుత్వాలు గానీ ఎందుకు పట్టించుకోలేదు?
తిరుమల భక్తులకు అందించే ప్రసాదాన్ని అంత పెద్ద మొత్తంలో తయారు చేయాల్సిన అవసరం టీటీడీకి ఏ మాత్రం లేదు. భక్తులకు స్వచ్ఛమైన లడ్డూ ప్రసాదాన్ని కొద్ది మొత్తంలో అందిస్తే సరిపోదా? అలా ఎందుకు చేయలేదు? తిరుపతి లడ్డును టీటీడీ ఒక వ్యాపార సరుకుగా మార్చింది, లాభార్జన కోసం ఆ పని చేసిందని అనుకోవాలి. వడ్డీ కాసులవాడే అయినప్పటికీ తిరుమలేశుడి ఆదాయం ఎంత భారీగా వుంటుందో అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి కోసం లడ్డుల అమ్మకాల ద్వారా సంపాదన పెంచాల్సిన అవసరం వుందా?
సింథటిక్ రసాయనాల నెయ్యి సరఫరాకు ఎవరు బాధ్యులో సిట్ స్పష్టంగా చెప్పింది. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. పభుత్వాలు చేయాల్సిన పని అదే. దాన్ని పక్కన పెట్టి ఇంకా రాజకీయాలు చేయడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామిక సంస్థలు బలంగా లేకపోవడం వల్ల ప్రజలు రెండు పార్టీల్లో ఏదో ఒకదాని పక్కన చేరుతున్నారు. మీడియా కూడా రెండుగా చీలిపోయింది. తటస్థ మీడియా లేదు. ఈ స్థితిలో వాస్తవం ప్రచారంలోకి వచ్చే అవకాశం లేదు. దీనికి స్వస్తి చెప్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు నిష్కృతి లేదు.