12 ఏళ్ల పాటు అద్దె చెల్లించకుండా అక్రమంగా హెచ్ఎంటి షోరూం ఎవరి అండదండలతో నడిచింది..?

12 ఏళ్ల పాటు అద్దె చెల్లించకుండా.? అక్రమంగా.?

 కొండపై హెచ్ఎంటి షోరూం ఎవరి అండదండలతో నడిచింది....??? 

 అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు లేవా!?

 టీటీడీకి వ్యతిరేకంగా.. కోర్టుల్లో కేసు వేసేందుకు సహకరించిన టీటీడీ ముదుర్లు...

 ప్రస్తుతం అదే ప్రాంతంలో అక్రమంగా ఎనిమిది అనధికారిక తట్టలు 

 తిరుమల జూన్ 3 మాయావి న్యూస్ : 

 కొండపై ఏ మూలన ఒక చిన్న తట్ట పెట్టుకోవాలన్నా కూడా టిటిడి రెవెన్యూ పంచాయతీ అధికారుల అనుమతి లేనిదే ఎంతటి వారి కైనా సాధ్యం కాదు.. చివరకు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఎటువంటి అనుమతి లేని హకర్లు కూడా ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇటు టిటిడి విజిలెన్స్ కు అటు పోలీసులకు బీటు ( రోజు వారి మామూళ్లు ) ఇచ్చుకోక తప్పదు. అంటే రోడ్డుపై తిరిగి అమ్మే వాళ్ళు కూడా ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారో మామూళ్లు తీసుకునే టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఠక్కున చెప్పేస్తారు. ఇలా లక్షల్లో మామూళ్లు తీసుకుని అవినీతికి పాల్పడుతున్న కారణంగానే కొండపై ఎటువంటి లైసెన్సులు లేని తట్టలు వందలకొద్దీ అడుగడుగునా వెలిసిపోయాయి అది వేరే విషయం అనుకుందాం...

 ఇప్పుడు అసలు విషయానికి వస్తే... ఇటీవల ఖాళీ చేయించిన హెచ్ఎంటి షోరూం ను ఆ సంస్థ 12 ఏళ్ల క్రితమే ఖాళీ చేస్తున్నట్టు లేక ఇచ్చినప్పటికీ ఖాళీ చేయకుండా అప్పటినుంచి ఇప్పటివరకు టీటీడీకి ఒక పైసా బాడుగలు చెల్లించకుండా ఇంతకాలం డిస్టిబూటర్ పేరుతో ఒక అనధికారిక వ్యక్తి ఎలా కొనసాగారో... ఇందుకు ఇంతకాలం సహకరించిన రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరో. దీని వెనుక జరిగిన కథాకమామిష్ ఏమిటో అంతులేని రహస్యంగా మారిపోయింది. 

 

 రెవిన్యూ అధికారుల అండదండలు లేనిదే కనీసం ఒక రోజు కూడా అందులో కొనసాగేందుకు వీలు లేదు. ఇంతకాలం అంటే 12 ఏళ్ల పాటు నెలకి లక్ష రూపాయల అద్దె చొప్పున టీటీడీకి రావలసి ఉన్న 12 ఏళ్లకు ఒకటిన్నర కోటికి పైగా షో రూమ్ అద్దె టిటిడి కి వచ్చి ఉండేది. అయితే టీటీడీకి ఇంతటి నష్టం కలిగించిన వ్యాపారి కంటే అతనికి నిర్లజ్జగా సహకరించిన రెవెన్యూ పంచాయతీ అధికారుల అవినీతి బాగోతాన్ని భగవంతుడు కూడా క్షమించడు. మరోవైపు ఇంతకాలం చేసిన తప్పు చాలదన్నట్లు ఇప్పుడు దుకాణాన్ని ఖాళీ చేయించిన రెవెన్యూ అధికారులు అక్కడ రోడ్డు వెడల్పు చేసే ప్రతిపాదన ఉన్నప్పటికీ వెంటనే ఈ హెచ్ఎంటి షోరూం కూల్చివేయాల్సిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. 

 ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ పేరిట ఈ హెచ్ఎంటి షోరూంను 12 ఏళ్ల పాటు అనధికారికంగా అనుభవించిన విజయ రాఘవన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం మరణించగా. అతని భార్య నిర్మల అనే మహిళ ఈ షోరూం తన పేరిట మార్చాలని టీటీడీకి విన్నవించడం, ఈ లేఖ ఆధారంగానే ఈ షోరూం అనధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తించి ఖాళీ చేయించి సీజ్ చేయడం జరిగింది.  

 అయితే ఇంత జరిగాక అయినా ఈ హెచ్ఎంటి షోరూం రోడ్డు వెడల్పు పేరిట వెంటనే కూల్చివేస్తే మళ్లీ ఆక్రమణలు జరిగా అవకాశం ఉండదు. రెవెన్యూ అధికారులు అలా చేయడం లేదు. 

 సరిగ్గా రెవెన్యూ పంచాయతీ అధికారులు పరోక్షంగా ఇలా సహకరిస్తున్న కారణంగానే ఇప్పుడు నిర్మల అనే ఆ మహిళ ఈ షో రూమ్ తనకే చెందాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అవసరమైతే గతంలో అనధికారికంగా అనుభవించిన 12 ఏళ్ల సమయానికి టీటీడీకి చెల్లించాల్సిన అద్దెలు కూడా తాము ఇప్పుడు చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ పిటిషన్ లో పేర్కొంది. దీని అంతటికీ కారణం కూడా ఇప్పటిదాకా 12 ఏళ్ల పాటు అనధికారికంగా ఆ షోరూంలో కొనసాగిన వారికి ఎటువంటి అర్హత లేకపోయినా టీటీడీ రెవెన్యూ పంచాయతీ విభాగం అధికారికంగా నోటీసు జారీ చేయడమే కారణంగా తెలుస్తోంది. 

 ఎవరి పేరిట షోరూమ్ ప్రొసీడింగ్ కేటాయించారో.. వారి పేరిట మాత్రమే నోటీసులు జారీ చేసే అధికారం రెవెన్యూ పంచాయతీకి ఉంటుంది. అలాకాకుండా అనధికారికంగా ఉన్న వ్యక్తికి అసలు నోటీసులు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో అవినీతి తిమింగలాలకే తెలియాలి. 

 రెవెన్యూ పంచాయతీ అధికారుల పరోక్ష సహకారంతో ప్రస్తుతం ఈ ఈ హెచ్ఎంటి షోరూం ముందు భాగంలో మొత్తం ఆక్రమణలకు గురైంది. ఎనిమిది తట్టలు అక్రమంగా వెలిశాయి. వైసీపీకి చెందిన ఓచోటా నేత చక్రం తిప్పుతూ ఈ ప్రాంతంలో ఖాళీ చేసిన హెచ్ఎంటి ప్రదేశాన్ని మొత్తం ఆక్రమించి ఎనిమిది తట్టలను అంటే దాదాపు 8 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కో తట్టకు రోజుకు ఐదు వేల రూపాయల చొప్పున అక్రమంగా మాముళ్లు వసూలు చేస్తున్నట్టు ఈ వైసీపీ నేతపై ఆరోపణలు ఉన్నాయి. టిటిడి ఉన్నతాధికారులకు తెలియకుండా పప్పులు బెల్లాళ్లా ఈ తట్టలను తిరుపతిలోని వైసీపీ నేతలకు పంచిపెట్టారు. ఈ తతంగం అంతా కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ టిటిడి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిద్ర నటిస్తోంది.  

కొండపై రాగి మాను జంక్షన్, డి ఎం బి రోడ్డు ప్రాంతంలో 1982లో హెచ్ఎంటి వాచ్ కంపెనీకి సంబంధించి 24×20 సైజు షోరూం కోసం టిటిడి స్థలాన్ని కేటాయించింది. కొంతకాలం ఆ కంపెనీ శ్రీవారి బొమ్మలతో ముద్రించిన హెచ్ఎంటి వాచీలను అమ్మకాలు డీలర్ ద్వారా జరిపింది. అటు తరువాత 2014లో తాము శ్రీవారి ప్రతిమలతో కూడిన వాచీల తయారీలో నిలిపేసామని, ఇకపై తమకు తిరుమల లో ఉన్న షో రూమ్ అవసరం లేదు అని వెంటనే టిటిడి స్వాధీనం చేసుకోవచ్చు అని లిఖితపూర్వకంగా లేఖను అందించారు. టిటిడి రెవెన్యూ విభాగం అధికారులకు కూడా అప్పుడే ఆ షోరూం ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో కూడా నమోదు చేశారు. అంతా బాగానే ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకు ముందు వరకు, హెచ్ఎంటి డీలర్ గా వ్యవహరించిన ఏ విజయ రాఘవన్ అనే వ్యక్తి స్థానికంగా ఉంటూ ఇదే షోరూమ్ అప్పటి నుంచి అనధికారికంగా నిర్వహించుకుంటూనే ఉన్నారు. 

 అతన్ని డీలర్ స్థానం నుంచి తొలగించామని కంపెనీ టీటీడీకి లెటర్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ సహకారం అందించారో తెలియదు గానీ... ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారాయో తెలియదు కానీ.. అప్పటినుండి సుమారు 14 ఏళ్ల పాటు ఈ షో రూమ్ ఎటువంటి అద్దె చెల్లించకుండా అనధికారికంగా తిరుమల కొండపై నడిపారు. చివరకు 2024 డీలర్ విజయరామన్ చనిపోయిన తర్వాత అతని భార్య ఏ నిర్మల అనే మహిళ ఈ షో రూమ్ లైసెన్స్ తన పేరిట మార్పు చేయాలని టీటీడీ కి దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తు తో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏ మోహన్ సిఫార్సులేఖ కూడా అందించింది. 

 అప్పటికి చేరుకున్న టీటీడీ రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎట్టకేలకు అంటే 25/05/2026 తేదీన సోమవారం ఈ దుకాణంపై ఎవరికి ఏ హక్కులు లేవంటూ ఇంతకాలం ఆక్రమణలోనే ఉందంటూ షోరూంను సీజ్ చేశారు. అంటే 12 ఏళ్ల పాటు అక్రమంగా షోరూంను టీటీడీకి ఒక్క రూపాయి చెల్లించకుండా ఒక అనధికారిక వ్యక్తి అంటే ఏ హక్కు లేని వారు అనుభవించారు అంటే ఈ తప్పు ఎవరిది... ఎలా జరిగింది. ఎవరు బాధ్యత వహిస్తారు.. టిటిడి పంచాయతీ రెవెన్యూ అధికారులకు తెలియకుండానే ఇంతకాలం ఈ వ్యవహారం నడిచిందా...??? దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు దర్యాప్తు చేపట్టడం లేదు అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.